
ఈమధ్య కాలంలో గ్రీన్ టీ వినియోగం పెరిగింది. గ్రీన్ టీ అనేక రకాల ప్రయోజనాలు అందిస్తోంది. ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల గ్రీన్ టీకి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది ఉదయం నిద్రలేచాక గ్రీన్ టీతోనే రోజును ప్రారంభిస్తారు.అయితే, పరగడుపున గ్రీన్ టీ తాగితే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీ పరిమితంగా.. నిర్దేశించిన సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, డీటాక్స్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా తాగుతారు. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. చెడు కొలె స్ట్రాల్ను క్లీయర్ చేస్తుంది. గ్రీన్ టీలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజంను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేసి శక్తిని ఇస్తుంది. మెదడును ఉత్తేజపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ మేలు చేసేవి కాగా, ఉదయం వేళ ఖాళీ కడుపున తీసుకునే వారికి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి కడుపులో ఆమ్లతను పెంచుతాయి. దీనిని తాగేవారికి వికారం లేదా ఉబ్బరం కలిగిస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగి..అజీర్తి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపున కాకుండా.. భోజనం తర్వాత లేదా టిఫిన్‌తో పాటు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇదే సమయంలో దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తిగా ప్రభావితం కావడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.గ్రీన్ టీలోని టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీంతో, రక్తహీనత సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. రక్తహీనత సమస్య ఉన్నవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఐరన్ లోపం మరింత ఎక్కువ కావచ్చు. ఇప్పటికే లివర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
