అధిక కొలెస్ట్రాల్ అదుపు మీ చేతుల్లోనే!


ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక కొలెస్ట్రాల్. ఎన్నో ప్రాణాంతక రుగ్మతలకు ఇదే కారణం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పటికీ అంత తొందరగా తెలియదు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే గుండె తో పాటుగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ ను ఆహారం.. జీవనశైలిలో మార్పులతో నియంత్రణలో ఉంచుకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్ అనే మైనపు లాంటి పదార్థం. కణాలను నిర్మించడానికి, విటమిన్ డి, హార్మోన్లు తయారు చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఇది ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి హానికరం. అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో ప్లాక్ ఏర్పడి గుండె జబ్బులకు, స్ట్రోక్ కు కారణమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉంటే సహజంగా ఛాతీ నొప్పి, కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి, చర్మ మార్పులు, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు, గుండె స్పందన లో మార్పు, దవడలో నొప్పి,మెడ వెనుక భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టైప్ 2 డయాబెటిస్, ఒబెసిటీ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అధికంగా మద్యం సేవించడం వంటి కారణాలు కూడా అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే, దీనిని నియంత్రణలో ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. వాల్ నట్స్ ను ప్రతిరోజూ అల్పాహారంగా తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బాదం, వేరుశనగ వంటివి క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రోజుకు 2 ఔన్సుల గింజలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5 శాతం వరకు తగ్గించుకోవచ్చు. అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఉదయం నడక లేదా వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆహారం.. జీవన శైలిలో మార్పులతో అధిక కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.

Scroll to Top