
నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవనశైలి రోజు రోజుకీ అస్తవ్యస్థంగా మారుతోంది. క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది. గతంలో వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు యువత ఈ కూడా చెడు కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. కొలెస్ట్రాల్ పరిమిత పరిమాణంలో శరీరానికి అవసరం. అయితే, అనుకున్నదానికంటే దాని స్థాయిలు పెరిగినప్పుడు.. అది రక్తనాళాల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్.డి.ఎల్. స్థాయిలు పెరిగినప్పుడు అది ధమనులలో పేరుకుపోయి అడ్డంకులకు కారణమవుతుంది. క్రమంగా, రక్త నాళాలు ఇరుకైనవిగా మారుతాయి. దీంతో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీస్తుంది. మందులు, సరైన ఆహారం తో పాటు వాకింగ్ కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె, మెదడుకు రక్త సరఫరాను ప్రభావితం చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే మందులు వాడటం తో పాటు జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు వివరిస్తున్నారు.
క్రమం తప్పకుండా నడవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. నడక చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమంగా కొవ్వు తగ్గుతుంది. ఇది బరువు నిర్వహణకు కూడా సాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ప్రతిరోజూ 30 -45 నిమిషాలు నడవాలని సిఫార్సు చేస్తున్నారు. మీరు కేవలం మామూలుగా నడిస్తే సరిపోదని, వేగంగా నడవాలని చెబుతున్నారు. బ్రిస్క్ వాకింగ్ చేయాలని వివరిస్తున్నారు.
నడక హృదయ స్పందన రేటును పెంచేలా ఉండాలి. కాసేపు వేగం పెంచి.. ఆ తర్వాత నెమ్మదిగా నడవాలి ఇది శరీరం మరిన్ని కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అయితే, ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం 20 నిమిషాలు పెట్టుకోవాలి. రోజు రోజుకి కొంచెం వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి నడకపై మాత్రమే ఆధారపడకూడదు.. ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించాలి. అన్నం, రోటీలు తినడం తగ్గించుకోవాలి. ప్రోటీన్ మొత్తాన్ని పెంచాలి. ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాల్ని చేర్చుకోండి. హైడ్రేషన్ కూడా ముఖ్యం. పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగడం అవసరం.
ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకోండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి జీవనశైలిలో భాగం చేసుకోండి.
తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రతి రోజూ 7 – 8 గంటల గాఢ నిద్ర పోయేలా ప్లాన్ చేసుకోండి. చివరగా ఆహారం, జీవనశైలిలో ఈ చిన్న మార్పులు వాకింగ్‌తో కలిపినప్పుడు అది బరువు తగ్గడానికి సాయపడుతుంది. లిపిడ్ ప్రొఫైల్‌ని గణనీయంగా మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.
