ప్రతీ రోజు ఎవరికి వారు ప్రొద్దున్నే లేచి
పట్టెడు ఫలహారం తిని పొట్లాలు పట్టుకెళ్ళేవాళ్ళు
పిట్టలు గూళ్ళకు చేరినట్లు ఇంటికి చేరి
ఎవరికి వాళ్ళు పొట్ట నింపుకొని నిద్రపోయేవాళ్ళు
రోజూ ఇంటి గూడునుండి ఎగిరిపోయే పక్షులు
గూడు గదుల్లోనే ఉంటున్నాయి
గదులుకి గోడలున్నా గుండెలకి లేవంటున్నాయి
‘కరోనా’ కరుణ గాలి సోకి కాలం గడుపుతున్నాయి
ఒక్కరోజు వంట చేస్తే చేతులు వంకర్లు తిరుగుతున్నాయి
బజారుకెళ్ళి సరుకులు తెస్తే కాళ్ళు నెప్పెడుతున్నాయి
జీవితమంతా జీతంలేని అమ్మ చాకిరీ చూసి కడగండ్లు తిరుగుతున్నాయి
‘కరోనా’ కరుణ గాలి సోకి ఆత్మ పరిశీలనాలోచనలు అలముకుంటున్నాయి
ఎప్పుడో ఊహ తెలియని వయసులో మా నాన్న ఇచ్చిన పుస్తకం
తెరచి చదివిన పాపాన పోలేదు ఈ మస్తకం
ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని మధుర స్మృతులు, జీవిత సత్యాలు
‘కరోనా’ కరుణ గాలి సోకి పుస్తకం తెరిపించింది – ఇది సత్యం
దుమ్ము పట్టి గది మూలల్లో సాలెపురుగు గూళ్ళు కట్టాయి
టైము లేదని కొన్ని సంవత్సరాలు చూస్తూనే గడిచిపోయాయి
మూల కూర్చున్న చీపురు ముందుకొచ్చి మురిసిపోయింది
‘కరోనా’ కరుణ గాలి సోకి సాలెగూళ్ళు అంగటి చేరాయి
ఎన్నో మైళ్ళ దూరాన అమ్మ, నాన్న ఎదురు చూస్తున్నారు
కష్టకాలంలో పిల్లలు కనిపిస్తారా అని కలవర పడుతున్నారు
అన్నిటికీ ఆ దైవమే సమాధానమని సర్దుకుపోతున్నారు
‘కరోనా’ కరుణ గాలి సోకి విలవిలలాడుతున్నారు
మానవాళి తనని తాను నిరూపించుకునే సమయం ఆసన్నమైంది
కులమతాలకతీతంగా పోరాట పటిమను అలవరుచుకోమంటుంది
మానవ జాతే మన కులమని మసులుకోమంటుంది
‘కరోనా’ కరుణ గాలి ఉత్తమమైన పాఠాన్ని నేర్పింది
–మల్లికేశ్వర రావు కొంచాడ