ఆరు పదుల తెలుగువారి ప్రస్థానం

తెలుగువారి సాంప్రదాయంలో అరవై సంవత్సరాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తెలుగు సంవత్సరాలు 60. మన జీవితంలో పుట్టిన సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తే దానిని షష్ఠి పూర్తి అంటారు. ఇలా షష్ఠి పూర్తి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ.

అయితే ఆస్ట్రేలియా దేశ చరిత్రలో తెలుగువారు వలస వచ్చి 60 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాము. 2023 వ సంవత్సరం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగు సమాజం, తెలుగు ప్రజలు ఒక మైలు రాయిని దాటబోతున్నారు. తెలుగువారందరూ ఈ ఘట్టాన్ని సగర్వంగా చెప్పుకోవచ్చు. మరో విషయం ఈ సందర్భంగా ప్రస్తావించాలి. 2021 సార్వత్రిక గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో తెలుగువారు అధికారికంగా 60,000 ఉన్నట్లు నమోదైంది.

1963 వ సంవత్సరం కంటే ముందు కొంతమంది తెలుగువారు వృత్తి, విద్యా పరంగా ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడం జరిగింది. కారణాలేమైనా వారు ఇక్కడ స్థిరపడకుండా వెళ్ళిపోయారు. అయితే 1963 నవంబరులో శ్రీ దూర్వాసుల మూర్తి గారు ఇక్కడికి వచ్చి సిడ్నీ నగరంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 95 ఏళ్ల శ్రీ మూర్తిగారు సామాజిక సేవ చేస్తూ సాహితీపరంగా మనకు ఎంతో స్పూర్తినందించారు. జూలై 8 2022వ తేదీన వారు దివంగతులైన సంగతి అందరికీ విదితమే.

ఈ సందర్భంగా తెలుగుమల్లి “ఆస్ట్రేలియాలో తెలుగువారి అరవై ఏళ్ల ప్రస్థానం” పై ఒక సవివరమైన సంకలనం ప్రచురించడానికి సన్నాహాలు చేస్తుంది. అన్ని తెలుగుసంఘాల ఆవిర్భావం నుండి నేటి వరకూ వాటి ప్రస్థానం సవివరంగా వ్రాసి పంపితే ఈ సంకలనంలో ప్రచురించడం జరుగుతుంది. తెలుగువారి అరవై ఏళ్ల ప్రయాణంలో ఏవైనా ప్రత్యేకమైన అంశాలు, ప్రముఖ ఘట్టాలు ఉంటే మాతో పంచుకోగలరు.

ఈ అవవై ఏళ్లలో మన తెలుగువారు సామాజిక, ఆర్ధిక, విద్య, వైద్య, రాజకీయ, కళా రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించారు. రెండవ తరంలోని చాలామంది యువకులు ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎన్నో విజయాలు సాధించారు. విజయ శిఖరాలనదిరోహించారు. ఈ విజయాలు ఒక సంకలనంగా  మీ ముందుకు తేవడానికి, భావి తరాలకు అక్షర రూపంలో అందివ్వడానికి తెలుగుమల్లి ఒక ప్రయత్నపూర్వకమైన ప్రక్రియను చేపట్టింది. అందరూ ఈ కార్యక్రమంలో భాగస్తులై జయప్రదం చేయగలరని తెలుగుమల్లి ఆశిస్తోంది.

తెలుగువారందరమూ సమైఖ్యంగా ఈ ఘట్టాన్ని ఉత్సవ రూపంలో జరుపుకోవాలని తెలుగుమల్లి అకాంక్షిస్తుంది. ఇప్పటి నుండి జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పకుండా మన అరవై ఏళ్ల ప్రస్థానం గురించి ప్రస్తావించాలని మనవి చేస్తుంది.

 

Scroll to Top