చీకటి చెప్పిన కధలు

కాలం నదిలో పడి
ఒక శాల్తీ కొట్టుకుపోయింది
గట్టు మీద
ఒక శాల్తీ కుప్పకూలింది

అమావాస్య రాత్రి
ఒక మిణుగురు పురుగు
ఒక తెల్ల కలువని
కుశల ప్రశ్నలు వేసింది

రాత్రి కలలో
భోరున వర్షం
పొద్దున్న చూస్తే చెక్కెలిపై
అక్కడక్కడా ఆరిన తడి

అటక మీద
బూజు పట్టిన ఒక పాత డైరీని
చెదలు ఆసాంతం చదువుతున్నాయి

పడమటి సంధ్యలో ఒక పక్షి
ఎవరినో వెతుకుతున్నట్టు
ఒంటరిగా ఎగురుతూ ఉంది

అద్దంలో ఒక రూపం
అపరిచితంగా తోస్తోంది
ఏదో పాత రఫీ పాటని
కూనిరాగం తీస్తోంది

అటు తీరం
పంపించిన అల ఒకటి
ఇటు తీరం
చేరకముందే చెదిరిపోయింది

దూరం నుండి లీలగా
ఎవరో వినిపిస్తోన్న
ఆనంద భైరవిలో
ఏదో అపశ్రుతి దొర్లుతూనే ఉంది
–అంజలి

Scroll to Top