ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేసిన మాలతీ చందూర్


ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేసిన విశిష్ట సాహితీవేత్త మాలతీ చందూర్. 1950ల నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ అనే పేరు తెలుగువారికి చిరపరిచితం. రచయిత్రిగా, కాలమిస్టుగా, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతగా గుర్తింపు పొందిన ఆమె వర్ధంతి ఆగష్టు 21. ఈ సందర్భంగా ఆమె సాహిత్య జీవన విశేషాలు…

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడులో 26 డిసెంబరు 1928న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివారు. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది.

ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళారు. అక్కడ వారి మామయ్య (చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరు లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ ద్వారా రచయిత్రులు డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా ‘కథావీధి’ అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన కవులు, రచయితలు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె ప్రత్యక్షంగా గమనించేవారు. సాహిత్యంపై ఆసక్తి ఏర్పడింది.

1947లో ఆమె, చందూర్‌ జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె, చందూర్‌ వివాహబంధంతో ఒక్కటయ్యారు. మద్రాసుకు వచ్చిన తరువాతే పైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. ఆమె ఇంతకు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియోలో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, పి.వి.రాజమన్నార్, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే డియర్ అబ్బీ వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే ఆమె నడిపారు. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ మహిళలకి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. మాలతీ చందూర్ రాసే “జవాబులు” ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ ‘జవాబులు’ శీర్షిక పేజీలను వార పత్రిక నుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకునేవారు.

తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులో సమీక్షలు చేశారామె. ఈ సమీక్షలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి ‘పాత కెరటాలు’ శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా అంశాలపై కాలమిస్ట్ గా అనేక పురస్కారాలు అందుకొన్నారు. 70వ దశకంలో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించారు. ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడిన మాలతీ చందూర్ 2013 ఆగస్టు 21న కన్ను మూశారు. మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు ఆమె శరీరాన్ని దానం చేశారు.

Scroll to Top