ఏ జన్మ పుణ్యమో ఈ జన్మ ధన్యం. ‘అనువుగాని చోట నధికులమనరాదు’ అన్న నానుడి నధిగమించి పరభాషా సంస్కృతితో సహజీవనం చేస్తూ ప్రపంచంలోనున్న 6,500 భాషల్లో మన భాషలోనే ఉన్న ఉత్కృష్టమైన ‘అవధాన’ ప్రక్రియ ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వారు మెల్బోర్న్ లో మొదటిసారిగా నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. దీని ప్రత్యేకత ఏంటంటే అవధాని గారితోపాటు ప్రుచ్చకులందరూ ఆస్ట్రేలియా వాసులు కావడం అందునా సింహభాగం IT రంగంలో పని చేస్తున్నవారే.
అవధాని శ్రీ కళ్యాణ చక్రవర్తి తటవర్తి రెండేళ్ల క్రితం అమెరికా నుండి ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడ పద్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిన పలువురిని కూడగట్టుకొని పద్యవిజయం సమూహాన్ని స్థాపించి గత 9 నెలలుగా ఛందోబద్ధమైన పద్యాలు వ్రాయడం నేర్పించి వారినే ప్రుచ్చకులుగా మలచుకొని మొట్టమొదటి అవధానం నిర్వహించారు. ఈ కార్యక్రమం హాస్య చతురోక్తులతో ఎంతో రసరంజకంగా సాగింది.
అవధాని: శ్రీ కళ్యాణ చక్రవర్తి తటవర్తి
సమన్వయ కర్త: శ్రీ మల్లికేశ్వర రావు కొంచాడ
పృచ్చకులు:
సమస్యా పూరణం మరియు నిషిద్ధాక్షరి : శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం
వర్ణన: శ్రీ శ్రీధర్ తుమ్మలపల్లి
ఆశువు: శ్రీ కామేశ్వర రావు మండలీక
దత్తపది: శ్రీ ప్రసాద్ పిల్లుట్ల
న్యస్తాక్షరి: శ్రీ శ్రీకృష్ణ రావిపాటి
వ్యస్తాక్షరి: శ్రీ సునీల్ పిడుగురాళ్ళ
అప్రస్తుతం: శ్రీ చారి ముడుంబి
పృచ్చకులు నేర్పుతో అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన జటిలమైన సమస్యలలో కనిపించిన అపారమైన ప్రతిభాపాటవాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అవధాని గారు వారికి దీటుగా సమస్యా పూరణం, ఆశువు, దత్తపది, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి – ఒకప్రక్క అప్రస్తుత ప్రసంగానికి చతురమైన సమాధానాలిస్తూనే ఆలవోకగా చేయడం ఎంతో ముదావహం.
ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ్ గారికి ప్రశంసా పత్రంతో పాటు “అవధాన శారదామూర్తి” బిరుదుని ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఉచితంగా వేదికనిచ్చిన జెట్ ఆస్ట్రేలియా, మెల్బోర్న్ వారికి తెలుగుమల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రశంసా పత్రం వ్రాయడమే కాకుండా ఈ మొదటి అవధానం నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక దిక్సూచిలా దిశా నిర్దేశాలు సూచించి తగిన శిక్షణ నిచ్చిన మా అందరికీ గురుతుల్యులు, పండితులు, పద్య రచయిత శ్రీ చింతలపాటి మురళీ మోహన్ గారికి ఇందులో పాల్గొన్న వారందరూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్యవిజయంలోని కవులు రచించిన లఘు పద్య కావ్యం “………..” ఆవిష్కరించడం జరిగింది. ఈ కావ్యం అలిపిరి నుండి తిరుమల వరకూ ఉన్న మెట్ల దారిని, ఆ దారిలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు, ప్రాముఖ్యమైన సందర్శనా స్థలాలను వర్ణిస్తూ ఛందోబద్ధమైన పద్యాలతో కవులందరూ కధా రూపంలో వ్రాయడం జరిగింది.
ఇటువంటి మరిన్ని అవధాన కార్యక్రమాలు నిర్వహించి తెలుగుభాష సేవలో తరించాలని అందరూ ఆకాంక్షించారు.