గృహ హింస

నలభై, ఏభై ఏళ్ల క్రితం ఏదో ఒక రూపంలో ఉన్నా ‘గృహ హింస’ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు, ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో. ఈమధ్య కాలంలో ఈ విషయం ఎక్కువుగా వినబడుతోంది. ప్రభుత్వాలు విచారణ సంఘాలను, రాయల్ కమిషన్లను నియమించి చట్ట సభల్లో కొన్ని చట్టాలను కూడా తీసుకొచ్చారు. ఈ విషయంపై ఎన్నో పత్రాల ప్రచురణ, సంఘాలు, సంస్థలు అవిరామంగా పని చేస్తున్నాయి. అనువైన చోట దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. దీనికి మన తెలుగువారు కూడా అతీతులేమీ కాదు.

మూల కారణాలు:
ఇప్పటివరకూ ముద్రితమైన అనేక పత్రాలలో వివిధ కారణాలు విశదీకరించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
1. వరకట్న వేధింపులు
2. తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలలో భాగస్వామి వివరాలు పూర్తిగా తెలియకపోవడం
3. విద్యార్థులుగా వచ్చి పెళ్లి చేసుకొని స్థిరపడలేక ఆర్ధిక పరిస్థితుల వలన గృహ హింసకు దారితీయడం
4. పెళ్ళైన తరువాత భాగస్వామికి వీసా పరిస్థితి తెలుపకుండా తీసుకురావడం
5. జీవిత భాగస్వాములే కాకుండా ఇతర కుటుంబ సభ్యుల ప్రేరణ
6. భాగస్వామిపై అధికార నియంత్రణ, సంపాదనపై ప్రతిబంధకాలు, కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం

పైనుదహరించిన కారణాలు కొన్ని మాత్రమే. ఒక్కొక్క విషయం పరిశీలిస్తే మరెన్నో బలీయమైన కారణాలుంటాయి.

అయితే ఇందులో ఎక్కువ బాధితులు స్త్రీలన్నది నిర్వివాదాంశం. భారతదేశం నుండి సుమారు 10,000 కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ సరైన కుటుంబ సహాయం లేక, వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్ధికంగా భర్తపై ఆధారపడి అభిప్రాయ బేధాలు పొడచూపినపుడు శారీరకంగా, లైంగిక వేధింపులకు గురౌతున్నారు. ఈ ప్రక్రియలో కొంతమంది న్యాయస్థానాలను, మరికొందరు స్థానిక స్వచ్చంద సేవా సంస్థలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ఆత్మహత్యలకు దారితీయడం కూడా విన్నాం.

సంఖ్యాపరంగా తెలుగువారి వివరాలు అందుబాటులో లేకపోయినా చాలామంది స్వచ్చందంగా సహాయాన్నందించేవారు ఈమధ్య కాలంలో పోలీసు ఠానాలలో, న్యాయ స్థానాలలో కేసులు చాలా ఎక్కువయ్యాయని చెబుతున్నారు. తెలుగు సమాజంలో ఇంచుమించు అన్ని ప్రధాన నగరాలలో న్యాయవాదులు అందుబాటులో ఉండడం ఎంతో ముదావహం. అయితే ఉచిత న్యాయ సలహా సంస్థలు, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే స్వచ్చంద సేవా సంస్థలు మరిన్ని నెలకొల్పితే బాగుంటుంది. తెలుగు సంఘాలు ఈ విషయమై మరిన్ని కార్యగోష్టులను నిర్వహిస్తే సభ్యులందరికీ ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు, రాజ్యాంగ సవరణలు కొంతవరకే ఉపయోగపడుతున్నాయి. ఇంకా మరికొన్ని చట్టపరమైన మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు: ఆధారిత వీసాపై వచ్చిన వారు, భాగస్వామి దుష్ప్రవర్తన వలన ఇబ్బంది పడితే వారు స్వదేశానికి వెళ్ళడం తప్ప ఇక్కడ జీవనం కొనసాగించడానికి ఇతర మార్గాలు లేవు. అలాగే, భాగస్వామి, పిల్లలు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగియున్నంత మాత్రాన ఏదైనా కారణాల వలన విడిపోతే తల్లికి గానీ, తండ్రికి గానీ ఆస్ట్రేలియాలో ఉండే హక్కు లేదు.

కుటుంబ భద్రతా వివరణ పత్రాలు:
ఆస్ట్రేలియా ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండడానికి తెలుగులో కుటుంబ భద్రతా వివరణ పత్రాలు ఈ క్రింది లంకెలో పొందుపరిచారు. ఇందులో వివిధ అంశాలపై సవివరమైన వివరాలు పొందుపరచి ప్రతీ విషయానికి ఎక్కడ సహాయం అందుతుందో సూచించారు.
https://www.dss.gov.au/women/programs-services/reducing-violence/telugu-telugu-translated-family-safety-pack-documents

Scroll to Top