భారతదేశంలో ఎక్కడెక్కడో పుట్టి పెరిగి విద్యాభ్యాసాలు పూర్తి చేసి, వలస రావడానికి కారణాలేవైనా, అందరమూ ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నవారమే. 1963 లో మొదలైన తెలుగువారి వలస 20వ శతాబ్దంలో పదుల నుండి వందల సంఖ్యలోకి పెరిగి ఈ శతాబ్దంలో ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు 2021 సార్వత్రిక గణాంకాల ప్రకారం అధికారికంగా సుమారు అరవై వేలకు చేరుకుంది. అనధికారికంగా దాదాపు లక్షకు చేరువుగా ఉంటుందన్నది చాలామంది అంచనా. 2023వ సంవత్సరం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగు సమాజం, తెలుగు ప్రజలు ఒక మైలు రాయిని దాటబోతున్నారు. తెలుగువారందరూ షష్ఠి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ ఘట్టాన్ని సగర్వంగా చెప్పుకోవచ్చు.
వివిధ నగరాలలో ఏర్పడ్డ కొన్ని తెలుగు సంఘాలకు ఇప్పుడే మూడు పదులు దాటుతోంది. మరికొన్ని ఇంకా యుక్త ప్రాయంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ వివిధ తెలుగు సంఘాలు, కొన్ని స్థానిక బృందాలు, కొంతమంది వ్యక్తిగతంగా ఆస్ట్రేలియాలో తెలుగు సమాజం శ్రేయస్సును కోరి వివిధ రంగాలలో తమ పరిధిలోని వనరులను సమకూర్చుకొని వారి సేవలనందిస్తున్నారు. అయితే ఈ సేవలు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండి సత్ఫలితాలనందుకున్నవారు చాలా తక్కువమందేనని చెప్పాలి.
ఏడెనిమిది సంవత్సరాలు NAATI వారితో సంప్రదింపులు జరిపి తెలుగు సామాజిక భాషగా గుర్తింపు పొందడానికి FTAA తో పాటు అన్ని తెలుగు సంఘాలు కృషి చేసాయి. దీని మూలంగా ఎంతోమంది విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. అనువాదకులు, భాష్యకారులకు ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. భారతదేశం వెలుపల ప్రపంచ దేశాలలో ఆస్ట్రేలియాలోనే మొట్టమొదట తెలుగు సామాజిక భాషగా గుర్తింపబడింది. ఇదెలా సాధ్యమైందని ప్రపంచమంతా మనవైపు చూస్తున్నారు.
ఇదే విధంగా ఉమ్మడిగా కార్యాచరణ ప్రణాళికను రచించుకొని మనకున్న సంఖ్యా బలాన్ని ఉపయోగించుకోవడానికి మార్గాలు సుగమం చేసుకోవాలి. ఈ అరవై ఏళ్ల ప్రస్థానం పురస్కరించుకొని తెలుగువారంతా ఒక నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికను చేపట్టడం అవసరం.
ఈ ప్రణాళికలో ఉండదగిన కొన్ని అంశాలు:
- భావి తరాలకు దిశా నిర్దేశాలను సూచించేదిగా ఉండాలి.
- రెండవ తరం వచ్చే 20-25 సంవత్సరాలలో తెలుగు సంఘాల పగ్గాలను చేపట్టి ముందుకు నడిపించగలగాలి.
- వివిధ వేదికలలో మన భాషా సంస్కృతులపై చర్చా గోష్టులు జరిగి ప్రపంచంలోని నాగరికతల్లో భారత నాగరికత కూడా అత్యున్నతమైనదేనన్న భావన కలగాలి.
- తెలుగు సంఘాలు మరియు ఇతర సేవా బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలి.
- ప్రతీ నగరంలోని తెలుగు సంఘాలకు స్వంతంగా ఒక స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవడమో లేక ఇతర భారతీయ సంఘాలతో కలిసి ఒక స్థిరాస్తిలో భాగస్థులు కావడం. దీనివలన ఆర్ధిక స్థోమత పెరిగి భద్రతా రాహిత్యం నుండి బయటపడాలి.
- వివిధ నగరాలలో నిర్వహించుబడుతున్న తెలుగు బడులలో ఒకే పాఠ్య క్రమం ప్రవేశపెట్టడం
- తెలుగు ఒక పాఠ్యాంశముగా స్థానిక పాఠశాలల్లో ప్రవేశ పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడం
- తెలుగు గ్రంథాలను ఇతర భాషలలో అనువదించాలి, ముఖ్యంగా ఆంగ్ల భాషలో. అన్య భాషల వారు తెలుగు భాషలోని మాధుర్యాన్ని గుర్తించి తెలుగు భాషను నేర్చుకోవడానికి ఈ అనువాదాలు తోడ్పడాలి.
- తెలుగు భాష ప్రపంచ భాషగా ఎదగడానికి తోడ్పడాలి.
- అవసరమైన చోట రిటైర్మెంట్ విలేజ్ లు నిర్మాణానికి ప్రణాళికలు తయారుచేసి ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందుకోవాలి