విశ్వావసు ఉగాదితో శుభారంభం

ముందుగా విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరాద్యంతము ఆయురారోగ్య సుఖ శాంతులతో వర్ధిల్లాలని తెలుగుమల్లి కోరుకుంటుంది.

ఆస్ట్రేలియాలో తెలుగువారందరూ కలిసి ఒకే చోట మూడు రోజుల పండగ జరుపుకోవాలన్న ఆకాంక్ష అక్కడక్కడా ఇదివరకూ వినపడినా కార్యరూపం దాల్చలేదు. అయితే ఫెడరేషన్ అఫ్ తెలుగు అసోసియేషన్స్ ఇన్ ఆస్ట్రేలియా (FTAA) మరియు తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా (TAAI) సంయుక్త నిర్వహణలో అన్ని తెలుగు సంఘాలు సమూహాలతో కలిసి వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా తెలుగుదనమే ‘తెలుగు ధనం’ గా మూడు రోజుల పండగ నిర్వహించాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టడం ఎంతో శ్లాఘనీయం. అయితే ఈ కార్యక్రమం ప్రతీ రెండేళ్లకొకసారి వివిధ నగరాలలో స్థానిక తెలుగు సంఘాల సహకారంతో నిర్వహించాలన్న తలంపుతో ఉన్నట్లు FTAA అధ్యక్షులు శ్రీ నడింపల్లి కృష్ణ గారు చెప్పారు.

ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాల నుండి పాల్గొంటున్న తెలుగు సంఘాలు, భారతదేశం నుండి వివిధ రంగాలలో నిష్ణాతులైన కళాకారులు, సాహితీవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ‘తెలుగు’ భాషా ప్రాతిపదికగా జరగబోతున్న ఈ మూడు రోజుల కార్యక్రమం తెలుగు వారి మనోభావాలకు అద్దం పట్టే విధంగా ఉండాలని పలువురు అభిలషిస్తున్నారు. ఇంతవరకూ వివిధ నగరాలలోని తెలుగు సంఘాలు, సమూహాలు ఆయా నగరాలలోని తెలుగువారితో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అయితే ఇతర తెలుగు సంఘాలతో, సమూహాలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో క్రొత్తదనం చూడాలని, పోటీ కోసం కాకపోయినా నాణ్యతలో మెరుగుదనం చూపించగలరని పలువురు పెద్దలు ఎదురు చూస్తున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా అంతరాష్ట్ర క్రికెట్, బాడ్మింటన్ వంటి ఆటల పోటీలు నిర్వహిస్తారు. తెలుగు భాషకు, సమాజానికి వివిధ రంగాలలో సేవలందించిన పలువురు సామాజిక వేత్తలకు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవించాలన్న ప్రతిపాదన కూడా ఉంది.

అరవై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గలిగిన తెలుగువారు ఆస్ట్రేలియాలో అధికారికంగా అరవై వేల సంఖ్యకు చేరుకున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య సుమారు వంద వేల వరకూ ఉంటుందన్న అంచనా. అయితే వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా సార్వత్రిక గణాంకాలు జరగనున్న సందర్భంగా ఈ ప్రక్రియ తెలుగువారి వెలుగుని ప్రతి ఇంటా నింపగలదని, పలువురి స్పందనతో వంద వేల అనధికార సంఖ్య అధికారికం కాగలదని ఆశిద్దాం.

ఉగాది వేడుక సందర్భంగా తీసుకున్న ఈ సమున్నతమైన నిర్ణయాన్ని ఆదరిస్తూ అన్ని తెలుగు సంఘాలు, సమూహాల ప్రతినిధులు సహాయ సహకారాలందించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి సమాయత్తం కావాలని FTAA కార్యవర్గం అకాంక్షిస్తుంది.

Scroll to Top