ఎలుకా! ఓ చిట్టెలుకా!!

విఘ్నాలకు విరుగుడని
విజయాలకు మార్గమని
వినాయక చవితి పండగ
జరుపుకుందామనుకున్నా!
ఇంతలో … నాలో అంతర్మధనం .
అడుగుదామనుకున్నా ఆ మూషిక రాజునిలా ..

ఉండ్రాళ్ళు, గుండ్రాళ్ళు
అట్లు, బొబ్బట్లు, గుగ్గిళ్ళు
వడపప్పు, పాయసం
పరవాన్నం, పంచామృతం
తను ఆరగించడని తెలిసీ
పోటీ పడి మరీ భక్తజనం
కొసరి నైవేద్యం పెట్టేందుకు
భక్తిశ్రద్ధల మురిసిపోతారదేందో?

పేదవాడు ఆకలితో
అయ్యా! అమ్మా ! అని, ఆర్తిగా
అడుక్కున్నా, వేడుకున్నా
కసిరి తరిమేస్తారెందుకో ?

ఆత్మ స్వరూపుడవైన నిను
మలిన మనసుల కానగలేక
మంచితనం ముసుగేసుకొన్న
ముష్కర(కోరికల) సామ్రాజ్యమిదిలే !

స్వార్థం, అర్థమొక్కటె తెలిసి
మూల్య మంత్ర ముగ్దులై
(అహం) భావజాలానికి బానిసలై
మనమున యాంత్రికచిత్తులై

ప్రతి విషయ విశ్లేషణలో
వ్యాపారం దృక్కోణమై
భయముచే భక్తిగ మెసలి
ముక్తిని పొందేద్దామనుకొనే
కుటిల, కుసంస్కారాల
మురిగి, మరిగిపోయిన
మానవ సమాజమిదని
ఎరుకేనా, మీ ఏలికకు ?
ఎలుకా! ఓ చిట్టెలుకా!!

Scroll to Top