కడుపు కోత

భూమిలో కలిసిపోయాడు
గుండె గడియారాన్ని కాలంలోకి విప్పుకోకుండానే
సమయం లేదంటూ వెళ్ళిపోయాడు
అమ్మకు గర్భశోకాన్ని కానుకగా ఇచ్చి
ఈ లోకం మీద అలిగి అంతర్ధానమయ్యాడు

పసిపువ్వులు ఎక్కడ విప్పారినా పరిమళాలు వ్యాపించేవి
బోసినవ్వులు తారసపడిన ప్రతిసారీ
ఊహల ఉయ్యాలలో విహరించేది
తప్పతడుగుల్ని తన్మయంగా పిండుకునేది
ముద్దుముద్దు మాటల్ని హృద్యంగా హత్తుకునేది
ఆ తల్లి అనేక కలలు కన్నది
బిడ్డను మాత్రం కనలేకపోయింది
*******************

ఒకసారి మూడో నెలలో
నెత్తుటి గడ్డలో వెక్కిరించావు
మరోసారి ఐదో నెలలో
అబోర్షన్ పిడుగు విసిరావు
ఇప్పుడు ఒడిదాకా వచ్చినట్టే వచ్చి
మాంసపు ముద్దగా దర్సనమిచ్చావు
ఎందుకురా కన్నా!
అమ్మతో కడుపుమూత లాడుతున్నావు
*******************

దుఃఖించకు తల్లీ! దుఃఖించకు!
డొల్ల హృదయాల మధ్యకు రావడానికి
వాడి మనసు పుష్పించడం లేదనుకుంటా
కాలుష్యపు కలల సాగరంలో ఈదడానికి
వాడి రెప్పలు విచ్చుకోవడం లేదనుకుంటా
మలిన కరచాలనాలు అందుకోవడానికి
వాడి చేతులు మొలకెత్తడం లేదనుకుంటా
*******************

నిన్న మొన్నటి దాకా
నీ కడుపులో కదలాడిన పిండం సాక్షిగా
నమ్మకం కోల్పోకు తల్లీ!
ఐసీయూ లో మనసును కోసిన చలికత్తులు
నీ పసి స్వప్నాలను గడ్డ కట్టించి ఉండొచ్చు
ఒకటో రెండో వసంతాలు
నీ మురిపాల మీద ముళ్ళు దూయొచ్చు
వాడు మళ్ళీ వస్తాడు
ఎట్నుంచి అయితేనేం ఎలాగైతేనేం
తప్పకుండా వస్తాడు
నీ నిరాశ నెత్తిన మూడో పాదం మోపడానికి
నీ గుండె గదుల్లో బంగారు పాలముద్రలు అద్దడానికీ
క్షణం ఊపిరాడకుండా
ముద్దులమూతలు గంపలకెత్తడానికీ
(శాలిని మానసిక క్షోభకు అక్షర ఓదార్పు)
–ఏమ్వీ రామిరెడ్డి

Scroll to Top