చుట్టూ వున్న పరిసరాలను గమనిస్తూ తన అనుభవాలను సరైన పదజాలంలో ఇనుమడించి కధా వస్తువును సమతుల్యంగా సరిదిద్ది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొన్న చిద్విలాస భోగి యోగి.
మాట్లాడుతూనే కోట్ల హాస్య తూటాలను పేలుస్తూ నవ్వుల కాంతులు వెదజల్లి నలుగురికీ ఆ హాస్య జల్లుల కేరింతలు అందివ్వాలన్న ఆకాంక్ష ఈ పుస్తక రూపంలో రావడం ఎంతో ముదావహం. హాస్పిటల్ లో సెలైన్ బాటిల్ చూసినా, బార్ లో విస్కీ బాటిల్ చూసినా స్పందించి తన ఆలోచనలకు పదును పెట్టి అక్షర సుమాలతో కధా వస్తువును తయారు చేయడం శ్రీ యోగి గారికే చెల్లుతుంది.
మాండలీకాల మాంత్రికుడుగా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ మాండలీకాల్లో తనదైన బాణీలో తెలుగు వారికీ ఆకట్టుకొని కధలు వ్రాయగల సత్తా ఈ కవిలోని సునిశిత మనస్తత్వానికి అద్దం పడుతుంది. పరదేశంలో ఉంటూ మాతృ భాషపై మమకారాన్ని శ్రీ యోగి గారు తన రచనల్లోనే కాకుండా రంగస్థలముపై వాక్పటిమతో పాటు నటనా కౌశలాన్ని ప్రదర్శించి మాతృ భూమికి అభినందనల హారతి అందిస్తున్నారు.