పరమార్థం

మీటర్లో సరిగా కూర్చోనక్ఖర్లేదు
ఈటెల్లా గుండెకి గుచ్చుకుంటే చాలు

మంత్రనగరపురవీధులు చూపనక్ఖర్లేదు
మనసు మరచిన మధురసీమకు తీసుకెళ్తే చాలు

కొత్త కలలపై కంటిపాపకు ఏ మోజూ లేదు
చెదిరిపోయిన కలల చెలిమిని తిరిగి తెస్తే మేలు

అపరగంధర్వగానకౌశలాప్రదర్శన వద్దు
మానసవీణ మంద్రంగా మీటి వెళ్తే చాలు

ఒట్టి మాటల గారడిలో ఏమున్నది జాదూ..?
ఒక్క గుండెను హత్తుకున్నా అదే పదివేలు

నా మాటలు సంద్రంలో ఉప్పునీళ్ళు కాదు
ఆల్చిప్పల గుండెల్లో దాగి ఉండే ముత్యాలు!

– అంజలి