విశేషార్ణవం

వాడిపోయినా పూవులలో విరిగంధమే వేరు
చెదిరిపోయినా స్వప్నాల్లో ఆ అందమే వేరు

ముఖాముఖిగా నీ వదనారవిందం ఎంత ముద్దొచ్చినా
వీడ్కోలు చెప్పాక వెనుతిరిగి చూస్తే ఆ అందమే వేరు

అడ్డు చెప్పమని చాటుగా అమ్మతో చెప్పి
నాన్న కోపం నటిస్తుంటే ఆ అందమే వేరు

వ్యావహారికంగా నా పేరు ఎంతోమంది పలికినా
నీ పెదవంచున నలిగితే ఆ అందమే వేరు

రోజు పొడవునా ఎన్ని రాగాలు రంజింపజేసినా
నాల్గవఝామున శుద్ధభైరవిలో ఆ అందమే వేరు

కిటికీలో నుండి రాత్రి రమ్యంగానే కనిపిస్తున్నా
మేడమీద వెల్లకిల్లా పడుకుంటే ఆ అందమే వేరు

నా కీర్తిపతాక ఎంతెత్తున రెపరెపలాడినా
నీ తేనెకళ్ళ మూగప్రశంసలో ఆ అందమే వేరు

ఛలోక్తులు చతురోక్తులు ప్రతి భాషలో ఉండేవే
తేటతెలుగు నుడికారంలో ఆ అందమే వేరు

ఇవేవీ నీకు తెలియని సంగతులు కాదు కానీ
‘అంజలి’ మాటల్లో వింటే ఆ అందమే వేరు

—రమాకాంత రెడ్డి

Scroll to Top