విషాధర!

ఈ ప్రాసాదపు ప్రాంగణం లో నీ తోడుగా!
ఆనందం అనంతంగా
ఆస్వాదించిన నేను!

పగిలిన నా గుండెల్లో!
దిగులును ఒంటరిగా ఆహ్వానిస్తున్నాను!

శుక్ల పక్షం!
ఏ పక్షపాతం లేక
వెన్నెల వాన కురిపిస్తున్న వేళ!

జ్యోత్స్న జలపాతం
ఈ జగతి వొడిలోకి
జారిపోతూ..!
మన అంతః పుర సరోవరాన
మీగడ తరగలా ఒరిగి పోయింది!

కానీ నువు లేవు!?

మొన్న పున్నమి రేయిలో!
సన్నగా నా చెవిలో
అన్నావు!

మరుల మత్తు రేపే
ఈ విరుల రెక్కలపై!
నాకోసం!
విరిభాణధరుని
అరవింద లేఖిని తో
శ్వేత కవిత రాస్తానని!

ఇపుడు నువు లేవు!?

కానీ అదే రాజ మందిరం!
తేజోమయంగా వుంది!

ఒక్క
నా గది ముందర!
మది లోపల!
చిక్కగా పరుచుకున్న చీకటి!

ఇపుడు నువు లేవు!?

జ్ఞాపకాలు మాత్రం!
ఓ వ్యాపక మల్లే !
కళ్ళెదుట మిణుగురుల్లా
మెరుస్తున్నాయి!

ఈ దినం!
తొలి పొద్దునే అడిగాడు!
మన కలల పంట!
నాన్నేడని !

అశాంతి ఝడిలో
తడిసే జనావళి కోసం!
శాంతి గొడుగు పట్టుకు
వెళ్ళాడన్నా!

పసి వాడు కదా!
మలి పొద్దుకైనా రావానీ!
బొమ్మ నాన్న తో వూసు లాడుతున్నాడు

విరబూసిన వెన్నెల రాత్రులైనా!
కటిక చీకటి పరుచుకున్న
చిక్కటి అమాసలైనా!

గాలి వాటం మారదు కదా!

అది!

నిన్నలో!
మనం విడిచిన
ఆనందానుభూతుల్ని!
మల్లెల వనం పైనుండి
ప్రేమ పల్లవిని
వల్లెవేస్తుంది మెల్లగా!

ఇక నీవు రావని!
రాకుమారునివి కాలేవని!
రాజ్యం నిండా దండోరా!

గాలి గుస గుసలో
ఈ వూసూ నిండింది!

రెప్పల తెర జారిపోయింది!
చెప్పలేనన్ని కలత కబుర్లతో!
స్వప్న వేదిక తడిసిపోయింది!

రాజైన! నిరు పేదైనా!
ఎవరి బాధలకూ!
తనకు బాధ్యత లేనట్టు!

ఉదయం యధావిధిగా!
తూర్పు వాకిట తొంగి చూసింది!

ఏ నడి ఝాము లోనో!
మము విడిచి!
నువు నడిచిన దారిలో!
గరికలు తమ మేనిపై!
నీ పాదాచ్చాదానాలు పదిల పరుచు కున్నాయి!

నా కన్నీటి చారికలు మాత్రం!
విరజాజి పూదోటన్తా!
గజిబిజి ముగ్గులేసుకున్నాయి!

మగాడు ఇంతే మగువా!
ఒక్క మాటతో
తెప్ప సాగి పోతాడని!

జంట నెడబాసిన
ఓ కలకంఠి!
కలత కంఠ రాగం
వినిపిస్తుంది!
దూరంగా…!
భారంగా….!

వింటున్నారు మరి!

నాటి యశోధర నుండి!

విషాదంగా!
ఒంటరి వేకువుల్ని
మేల్కొలుపు తున్న!
నేటి విశాధర..లు కొందరున్నూ….!

మీ…✍🏼విక్టరీ శంకర్

Scroll to Top