హేమంత గీతిక

ఎక్కడున్నావ్ వసంతమా ??
ఎటు వెళ్లిపోయావ్ నువ్వు ?

క్రితంసారి నువ్వు కప్పిన
ఆకుపచ్చ శాలువా నేలరాలి
చలిగాడ్పుల కొరడాలకు
తరు:కాంతలు తల్లడిల్లేను
చిగురాకుల చీరలు మళ్ళీ
నులివెచ్చగా కప్పిపోరాదా..?

కాలం ఎటూ కదలనంటే
కలం ముందుకు నడవనంటే
కటికచీకటి కర్కశంగా , నా
కలలతోటను కమ్ముకుంటే
వివశుడినై, విగతుడినై
కలత చెంది ఉన్నాను, నను
కనికరించి పలకరించ రారాదా..?

సీతాకోకచిలుకలు ఆడే
సిరిమల్లెలు నిండిన తోట
పచ్చదనం గుండెల్లో పారే
సెలయేరుల గలగల పాట
నీ జ్ఞాపకాల కౌగిలింతలో
ఎన్ని రాత్రులు కరగబెట్టాను
ఎంత దూరంలో ఉన్నావో
కోకిలమ్మతో కబురు పంపరాదా..??

ఓ ఆమనీ!
నువు ఆగమిస్తే ఎదురేగి
సాదరంగా పాడాలని
స్వాగతగీతం వ్రాస్తున్నాను
ఎక్కడున్నావ్ నువ్వు?
ఎప్పుడొస్తున్నావ్??

–రమాకాంత్ రెడ్డి, మెల్బోర్న్

Scroll to Top