బీట్‌రూట్ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!


ప్రకృతి సహజ పోషకాలతో నిండిన కూరగాయల్లో బీట్‌రూట్ ఒకటి. దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక ప్రత్యేక సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేస్తున్నారు.

* బీట్‌రూట్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. గర్భిణీ మహిళలలో, రుతుస్రావం సమయంలో రక్త నష్టాన్ని భర్తీ చేయడంలో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

* బీట్‌రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉండడం వల్ల రక్తనాళాలు విస్తరించి, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో , రక్తపోటు నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

* బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుభ్రం చేస్తాయి. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ముడతలు, చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తగ్గుతాయి.

* బీట్‌రూట్ జ్యూస్‌లో సహజంగా ఉండే ఫోలేట్ , ఇతర పౌష్టికాలు గర్భిణీ మహిళల శిశువుల అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇది రక్త హీనతను నివారించడం ద్వారా గర్భిణీ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

* బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్‌లు శరీరంలో ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శక్తిని పెంచి, వ్యాయామ సమయంలో లేదా నిత్య జీవితంలో దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.

* బీట్‌రూట్‌లోని ఐరన్, ఫోలేట్ జుట్టు వృద్ధికి సహాయపడతాయి. ఇది తల చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

* బీట్‌రూట్‌లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి, ఇవి ఎముకల బలాన్ని మెరుగుపరుస్తాయి. ఇది వయసుతోపాటు వచ్చే ఎముకల సమస్యలను నివారిస్తుంది.

* బీట్‌రూట్ లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.

* బీట్‌రూట్‌లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి. రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పి, మూడ్ స్వింగ్స్, పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో బీట్‌రూట్ కీలక పాత్ర పోషిస్తుంది.

* బీట్‌రూట్ జ్యూస్ తక్కువ కాలరీలతో ఉండి, పొటాషియం వంటి ఖనిజాలతో శరీరంలో ద్రవాలను నిర్వహిస్తుంది. ఇది శరీరానికి తేలికపాటి డిటాక్స్‌గా పనిచేసి బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

*ఎలా తాగాలంటే….? తాజా బీట్‌రూట్‌ను శుభ్రం చేసి మిక్సర్‌లో వేసి జ్యూస్ రూపంలో తీసుకోవాలి. రుచికి తగ్గట్టు అల్లం, నిమ్మరసం లేదా కొద్దిగా తేనె కలపవచ్చు. ఉదయం తినడం ముందు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

* కొన్ని జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో చక్కెర అధికంగా ఉండటంతో మధుమేహం ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవడం మంచిది. కొందరికి బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల మూత్రం లేదా మలంలో గులాబీ రంగు కనబడవచ్చు. ఇది సహజమే. దీనికి భయపడాల్సిన అవసరం లేదు.

Scroll to Top