గిడుగుబాటలో ఆయన తనయుడు సీతాపతి
*ఈనెల 28 గిడుగు వెంకట సీతాపతి జయంతి
**********************
గిడుగు వెంకట సీతాపతి ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి. వీరు జనవరి 28, 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి గిడుగు వెంకట రామమూర్తి దంపతులకు జన్మించారు.
మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, సవర భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలనచిత్రాలలోను, కొన్ని నాటకాలలోను నటించారు.
1945లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో తెలుగు భాషా సమితి ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి: ‘భారతీ శతకము’, ‘సరస్వతీ విలాసము’, ‘కొద్ది మొర్ర’. వీరు రాసిన ‘బాలానందము’ వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు బైబిల్ లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు రచించిన ‘తెలుగులో ఛందోరీతులు’ అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను ఒడిషా రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు లండన్ వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది. తండ్రితో అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.
ఈయనను ఆంధ్రవిశ్వకళా పరిషత్ కళా ప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. వీరి ఇంగ్లీషురచనల్లోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్ ప్రదానం చేసింది.
సీతాపతి రాసిన రచనలన్నీ ఒక ఎత్తు అయితే, బాలల కోసం సృష్టించిన సాహిత్యం మరొక ఎత్తు. ఈయన చిలకమ్మ పెళ్లి, ఎలుకా-పిల్లి, రైలుబండి, ఈగా-సాలీడు మొదలైన రచనలు 1907-1909 మధ్యకాలంలో ‘వివేకవతి’ పత్రికలో ప్రచురిత మయ్యాయి. ఆనాడు బాలగేయాలకు అసలు ఆదరణే వుండేది కాదు. ఆ కారణంచే ఆయన చాలా కాలం వరకు మళ్ళీ గేయాలు రాయలేదు.
సీతాపతి 1909 సంవత్సరంలో రాసిన చిలకమ్మ పెండ్లి గేయకథలో బొమ్మల పెళ్లిళ్లను గూర్చి –
“చిలకమ్మా పెండ్లి అని చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు.
పందిట పిచ్చుకలు సందడి చేయగా
కాకుల మూకలు బాకాలూదగ
కప్పలు బెకబెక డప్పులు కొట్టగ
కొక్కొరోకోయని కోడికూయగా
ఝుమ్మని తుమ్మెద తంబుర మీటగ
కుహుకుహుయని కోయిల పాడగా
పిల్ల తెమ్మరలు వేణువూదగా
నెమలిసొగసుగా నాట్యం చేయగా
సాలీడిచ్చిన చావుకట్టుకుని
పెండ్లి కుమారుడు బింకము చూపగ
మల్లీమాలతీ మాధవీలతలు
పెండ్లి కుమారుని పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగా
మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టె చింతాకుల పుస్తె…..”
అంటూ
ఈ గేయం ప్రకృతి సౌందర్యంలో పెళ్ళి ముచ్చట్లను మేళవించి పిల్లలకు వేడుక కలిగించింది.
“పిల్లల చెవులకు ఇంపగు పలుకులు
పిల్లల మదిలో నిలిచే నీతులు
పిల్లల కోసము పిట్ట కథలుగా
పెద్దలు చెప్పండీ సుద్దులు పలకండీ” అన్నారు.
రాతలు కాకుండా పిల్లలు మెచ్చేవి చిరకాలం మనసులో నిలిచే కథలు, కబుర్లు తేలిక భాషలో చెప్పాలంటారు సీతాపతి. ఆ తర్వాత 1940 సంవత్సరంలో సీతాపతి ”భారతి’ సాహిత్య మాస పత్రికకు సంపాదకులైనప్పుడు బాలలకోసం సుహిత మైన రచనలు చేయమని కవులకు, రచయితలకు ప్రబోధించారు. ఈ విన్నపానికి చాలా కాలం ముందే బాల సాహిత్య వికాసం పట్ల విజ్ఞాన దృష్టి కలిగిన సీతాపతి గారి మనవి యిది.
బాల చిత్తములు చిగుర్చునట్లుగ
పాటలు పాడండో కవులార!
పిల్లల ఊహాలు ప్రబలేరీతిని
పిల్లల కనువగు నీతులు చూపే
అచ్చరవును కల్గిస్తూ అందరూ
మెచ్చెకథలను చెప్పండయ్యా!…”అని అన్నారు.
సీతాపతి తృష్ణ నెరవేరింది. నూతనోత్సాహంతో కవులు, రచయితలు బాలల కోసం కలం పట్టారు. వారు రాసిన గేయాల్ని గేయకథల్ని చిన్న కథల్ని 1955 సంవత్సరంలో ‘బాలానందం’ అనే అనే శీర్షికతో పుస్తకరూపంలో ముద్రించారు. 1958 సం||లో బాల వినోదం అనే గేయసంపుటా న్ని ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన బాలసాహిత్య రచనాలయాల్ని నిర్వహించి యువ రచయితలకు శిక్షణ కూడా యిచ్చారు. ఎందరో, కవులకు రచయితలకు మార్గ దర్శకులయ్యారు.. అందుకే ఆయనని ‘ఆధునిక బాల గేయ సాహిత్య ఆధ్యులు అని అంటారు.
వీరికి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీషు రచనలలోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్ లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్. గౌరవం ఇచ్చింది.
ఈయన సినిమాల్లో కూడా నటించారు. పల్నాటి యుద్ధం(1947)లో కొమ్మరాజు, భక్తిమాల(1941)లో రామానుజాచారి
రైతుబిడ్డ(1939)లో జమీందార్, పంతులమ్మ (1943), మాలపిల్ల(1938) సినిమాల్లో నటించారు. వీరు ఏప్రిల్ 19, 1969లో హైదరాబాదులో పరమపదించారు.