
క్రితం సంవత్సరం, మెల్బర్న్ తెలుగు కుటుంబాల సమూహమందు, క్రొంత మంది కైలాస పర్వతం చుట్టూ కోరా (పరిక్రమ) మరియు మానస సరోవర యాత్ర గురుంచి చర్చించుకుంటుంటే, మేము కూడ ఆసక్తి చూపాము.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఎప్పుడో – పదేండ్ల క్రితం అనుకుంటా, ఒక కల వచ్చింది, లీలగా ఎంతవరకు గుర్తుందంటే, కైలాస పర్వతం చుట్టూ ప్రదిక్షణ చేస్తున్నట్టు, చాలా కష్టపడుతున్నట్ట్లు. ఇంతలో మెలకువ వచ్చేసింది. ఆ రోజు ఎక్కడో ఈ వార్త గురుంచి చదవడమో, వినడమో జరిగి వుంటుంది అని, కలని ప్రక్కకి పెట్టి దైనందిన కార్యక్రమాల్లో పడిపోయాను.
మరల 2024లో కొంతమంది స్నేహితులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం యాధృచ్చికమా, దైవేచ్చా, దైవాఙ్ఞ ఏదైనా కాని మేమిద్దరం మనస్పూర్థిగా తయారవ్వడము మొదలెట్టాము. అన్నింట్లోకి మొదటిది, ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ల అనుభవాలు – ఎంత కష్టమో, ఎలా సిద్ధం కావాలో, వారికి జరిగిన అనుభవాలు సంగ్రహించడములో మునిగిపోయాము. మానసికంగా సిధ్ధమయ్యాక, భౌతికంగా కూడ బలం పుంజు కోవడములో ధ్యాస పెట్టాము. టూ.కీ.గా చెప్పాలంటే 6 నెలలు – యొగా, ప్రాణాయామము, వారాంతపు సుదీర్ఘ నడకలు మమ్మలని రెండు రకాలు గానూ సమాయత్తపరిచాయి. ఈ సన్నాహపు అనుభూతులు ఎప్పుడు తలచుకున్నా మంచి ఙ్ఞాపకాలు. అందరూ వారి వారి సౌకర్యమైన, సుఖమైన దినచర్యల్లో మార్పులు చేసుకుని, వారి వారి ప్రయత్నాల్లో మునిగి పోయారు. అందరి రూపు రేఖలు మెరుగయ్యాయి. ఒక ఐదేండ్లు వయస్సు తగ్గినట్టే.
6-మే 2025 – పద్దెనిమిది మంది నేపాల్ – ఖాట్మండు లో కలిసి తిరిగాము. ఒకరిద్దరు 1-2 రోజులు ముందే వెళ్ళి ఖాట్మండు చుట్టుపక్కల సుందరమైన, అద్భుతమైన దేవాలయాలు, శక్తి పీఠాలను చూసారు. వారు అందజేసిన సమాచారంతో మేము కూడా వున్న కొంచెం సమయములో చాలా వరకు చూడగలిగాము – అందులో చెప్పుకోదగినవి – పసుపతినాథ్, ఒక శక్తి పీఠం, బౌధ్ధ స్తూపం – తిరుగు ప్రయాణము లో చూసిన – చాంగ్ నారాయణ, ఢోలేశ్వర్ ఎంతో చక్కని ఆధ్యాతిక, చారిత్రాత్మిక అనుభూతులు.
మరి ప్రక్కన చూపిన పటము ప్రకారం మా కైలస పర్వత యాత్ర అనుభూతులు చెప్పాలంటే
1- నేపాల్ నుంచి చైనా-టిబెట్ సరిహద్దు ప్రయాణం – ఉత్తరం వైపు – హెలికాప్టర్ (30 నిమిషాలు) / రోడ్డు మీదా (6 గంటలు) ఏ మార్గము గుండా వెళ్ళినా – అడవులు, కొండలు, లోయలు – ఎంతో అందముగా వుంటుంది.
2 – గయిరోంగ్ పట్టణము – సరిహద్దు నుంచి 30 కి.మీ. – 2700 మీటర్ల ఎత్తు – ఆహ్లాదకరమైన చిన్నటి పచ్చని వూరు. నేపాలి భోజనము, హింది చిత్ర గీతాలతో స్థానిక యువతీ యువకుల నృత్యము, మంచి బస – రాత్రికి మంచి ఆతిథ్యము లభించింది. ఉదయం లేవగానే- గది లోని కిటికీ నుంచి చూస్తే మంచు పర్వతాలు, మంచి ఫలహారం, మొదటి – బౌధ్ధాశ్రమము, అక్కడి ఊరి జనుల సాష్టాంగ ప్రణామములతో, నెమ్మది గా ఆధ్యాత్మికత ఆవహిస్తుంది. నా కైతే.. శూన్యంగా అనిపించడము తెలుస్తుంది (మన పరి భాషలో చెప్పాలంటే – భూలోకపు అంచులు కనపడుతున్నాయి).
3- ఇంకొక 200కి.మీ -ఉత్తరము వైపున – సాయంత్రానికి, సాగా అనే ఊరు చేరుకున్నాము – 4200 మీటర్ల ఎత్తు – ఇక్కడికి వచ్చేసరికి అందరికీ అసక్తత, ఊపిరి పీల్చడము కష్టమైనది. మంచి బస (నాలుగు నక్షత్రాల హోటెల్), గదిలో ఆమ్లజని ఏర్పాటు వున్నా మనకి ఈ ఎత్తు అలవడటానికి కొంచెం సమయం పడుతుంది. ముందు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా శరీర తత్వాన్ని బట్టి అస్వస్థత మొదలైనది. నాకైతే – ముక్కు ఎండిపోయి రక్తం కారడం మొదలైనది, ఎంత విక్స్ వేపరబ్ రాసినా, సలైన్ నీళ్ళు పీల్చినా – ఈ పరిణామము మరల మెల్బోర్న్ వచ్చిన 4 రోజుల వరకు తగ్గలేదు. మామూలుగా నడవగలిగాను కానీ, కొంచం ఎత్తు వచ్చినా ఆయాసం, ఏమి తినాలని లేదు, తినాలంటే ఆయాసం. మరీ భయపడేదైతే కాదు, ఈ అసౌకర్యం వుంటుంది అని తెలుసు, కాని రోజంతా అంటే ఇబ్బంది కదా. అందుకే గుర్తుండి పోయింది. ఇలాంటివి అధికమిస్తే, ఇక్కడ గమనించవలసినవి – గంజి లాంటి పదార్థాలు మాత్రమే తీసుకోగలము. శాఖాహారులకి ఒకటి, రెండు రకాలు మాత్రమే దొరుకుతాయి. వెళ్ళేటప్పుడు అంతకన్న ఎక్కువ తినలేము కూడా. తిరుగు ప్రయాణములో మనం ఈ ఎత్తులో వుండటం అలవాటవుతుంది కాబట్టి కొంచం తినగలము, అప్పుడు మా వాళ్ళు ఒక నేపాలి ఫలహారశాల పట్టి మంచిగా భోజనం చేసారులెండి. మనకి పళ్ళు, కొన్ని కూరగాయలు, నిత్యావసర వస్తువులు మంచిగా దొరుకుతాయి. ఏ హోటెల్ ఆవరణలోనైనా , భోజనశాలలైనా సిగరెట్టు పొగ ఆవృత్తమై వుంటుంది. నేనైతే ఇది భరించలేకపొయాను.

4- సాగా నుంచి 8 గంటలు – 550 కి.మీ. పడమర వైపు వెళ్తే – డార్చిన్ (టాల్చిన్) వూరు వచ్చింది. ఇక్కడ కొన్ని పండ్లు అవి తీసుకుని – మితాహారముతో పండుకుని, తరివాతి రోజు పరిక్రమ గురుంచి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాము. ఒక హోటెల్ నుంచి తరువాతి మన హోటెల్ వరకు పృకృతిలోనే కాలకృత్యాలు చేయడం అంటే కష్టమే. ఈ విషయంలో బస్సు ద్రైవర్ కొన్ని ప్రదేశాలు చూసి బస్సు ఆపడముతో కొంచం ఊపిరి పీల్చుకున్నట్టే (ముఖ్యం గా స్త్రీలు).
5- ప్రొద్దున్నే మేఘాలు కమ్ముకొన్నాయి. ముందు రోజు వాతావరణం చూసుకున్నాము కాబట్టి అంత ఆశ్చర్యపోలేదు. కాని బస్సు ఎక్కుతుంటే చిన్న చిన్న మంచు తుంపర్లు అనిపించింది. ఈ ఆందోళనే నిజమయింది. యమద్వారము దగ్గర బయల్దేరేటప్పుడు మనకి ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం మనము బరువులు మోసెవాడిని గాని, గుఱ్ఱము అద్దెకు తీసుకున్న దగ్గరి నుండి, మొదటి రోజు నడవ వలసిన 13 కిమీ – 7 నుంచి తొమ్మిది గంటలు పట్టింది – మాతొ పాటు కొంత మంది 3 మంచు వర్షాలను, ఒకరిద్దరు 4వ మంచు వర్షం కూడా తీసుకెళ్ళాము. కొంచెం అదృష్టమేంటంటే – కైలాస పర్వత పడమటి దర్శనము, ఉత్తర దర్శనపు సమయములో మేఘాలు లేవు, మంచుపడలేదు. శివుని (పర్వతపు) లీలలు చూడగలిగాము. ఇవి చెప్పేముందు రెండు విషయాలు గుర్తుండేవి ఏమిటి అంటే – మనతోనె వస్తూ ఉండే పోర్టర్లు, 3 టీ హవుజ్ల లో సేద తీరడము.
6 – కైలాస పర్వతపు అనుభూతులు – ఒక్కొక్క కోణంలో, మనకి పర్వతపు అంచులు, దాని మీద మంచు ఎన్నో ఆకృతులు కనిపిస్తాయి — ఒకరికి – గణేశ కనపడుతాదు, ఒకరికి – ఢమరుకం, శివ పార్వతులు, ఓం – గుర్తు, పర్వతం ముందు కొండ – మనిషి సాష్టాంగం చేస్తున్నట్టు. ఇవన్నీ వారు ఎంతొ భక్తి పారవస్యములో మునిగి చూపిస్తూ, ఆయాసం తో చెప్తుంటే – వినేవారికి, చూసేవారికి ఆశ్చర్యముతో కూడుకున్న ఆనందం.
అదిగో ఓం, అల్లదిగో ఢమరుకం, అమ్మవారు అక్కడ, ప్రకనే అయ్యవారు, ఆ మూలన అయ్య వారికి సపర్యలు చేస్తున్న గణేసుడు
ముందు సాష్టాంగము చేస్తూ పరిక్రమ చేస్తున్న టిబెటన్లు.
(54 కి.మీ. లోక కల్యాణము కోసం ప్రదిక్షణ చేస్తున్నారంటే – వారి మానసిక ఉచ్చ స్థితికి, నిర్మలత్వానికి శత కోటి దండాలు).
7 – మిగతా పరిక్రమ ఆగిపోయింది – డురాపుక్ (4700 మీటర్ల ఎత్తు) దగ్గరకి చేరుకునేటప్పడికి సాయంత్రం 7 గంటలయ్యింది కదా. అందరి పరిస్థితి గమనించి గైడ్ తరువాతి రోజు 4 గంటలకి బయలుదేరి 22 కి.మీ. నడక, అందులోనూ 700 మీటర్ల ఎత్తు వెళ్ళాలి. అందుకే ముందుకు వెళ్ళే బదులు ఇక్కడే వెనుదిరగడానికి నిర్ణయించుకున్నాము. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. తరువాతి రోజు ప్రొద్దున్న అందరం కైలాస పర్వత ఉత్తరం వైపు నుంచి హారతి ఇచ్చి, ధ్యానం చేసుకోగలిగాము. రెండు గంటల సమయం ఎంతో ఆధ్యాత్మికంగా మంచి ఙ్ఞాపకాలు మిగిల్చాయి.
ఉదయాన్నె కైలాస సిఖరాన నెమ్మదిగా తెరలు తెరలు గా వీడుతున్న మేఘాలు. రాత్రి మంచువృష్టి తో మెరుస్తున్న హిమగిరులు,
మనసు నిండా కైలాస పర్వత వుత్తర దర్శనము కర్పూర హారతి తో నీరాజనము. అద్వితీయం, అమోఘము, మా అందరికీ అజరామరము.
8 – కైలాస దక్షిణం చూడటం – జీపుల్లో సునాయాసంగా వెనక్కి డార్చిన్ చేరుకున్న మాకు, సాయంత్రపు షికారు లో యాదృచికంగా మా సమూహములోని వ్యక్తికి తెలిసిన వ్యక్తి కనపడి, 30 నిమిషాల బస్సు ప్రయాణము లో సాలుంగ్ బౌధ్ధాశ్రమము గురుంచి చెప్పడము, ఫొటొలు చూపించడముతో, మా గైడ్ ని, మిగతా సమూహాన్ని ఒప్పించి అందరం తరువాతి రోజు ఉదయాన్నే అక్కడకి వెళ్ళాము. బౌధ్ధాశ్రమం నుంచి ఒక 500మీ నడిచి – 100మీ ఎత్తులో మంచి ప్రదేశములో కూర్చుని శివుడిని చూసినట్టే వుంది. శివుని ముందు నంది కూర్చున్నట్టు ఒక కొండ. అందరూ తన్మయత్వములో మునిగిపోయారు. భావోద్వేగము పతాక స్థాయికి చేరుకుంది. అందరము ధ్యానము లో తరించాము. మొదటిసారి, కళ్ళు తెరిచి ఆ శివుడిని చూస్తూ ధ్యానము చేసుకున్నట్టే. అందరూ భజన కూడా చేయగలిగాము. ఈ ప్రదేశము నుంచి తొందరగా వెనక్కి రావాలంటే ఎవరికీ మనసొప్పలేదు.
నిర్మలాకాసాన ప్రసన్న వదనముతో మమ్ములను రప్పించుకుని మా భావోద్వేగాల పతాకస్థాయిని చూపించి మమ్ములను మాకు పరిచయం చేసిన త్రినేత్రుడు. నా ఆత్మలింగాన్ని స్పృశించిన మహాలింగం!
9 – మానస సరోవరం – అయిష్టంగానే సాలుంగ్ బౌధ్ధాశ్రమము-కైలాస దక్షిణ చూపులు నుంచి వెనక్కి బయల్దేరి ఒక గంటలో మానస సరోవరపు ప్రశాంత వాతావరణము చేరుకున్నాము. ఇక్కడ స్నానము చేయకూడదు. అందరం నీళ్ళు జల్లుకుని, సీసాల్లో పట్టుకుని, ప్రార్థన చేశాం. అన్నిటికన్నా ముఖ్యమైనది అర్థరాత్రి మరల సరోవరం వెళ్ళినప్పుడు, కైలాస పర్వతం వైపు ఆకాశంలో జరిగే ఖగోళ వింతలు చూడగలిగాము. క్రిందపడే ఉల్కలే కాదు, పైకి వెళ్ళే వాటినీ చూడగలిగాము.

పగటి పూట ప్రశాంత పిల్లగాలిలో పద్మాకరము (కొలను) శరీరానికి పరిశుభ్రత ఆత్మకు ఆనందహేల, మాపటేల తారల సందడి
కొన్ని శివునికి నమస్కరిస్తూ తమ లోకం వైపు వెళ్ళిపోతుంటే
కొన్ని పాదాల చెంత సేద తీరుతున్నట్లుంది (శివైక్యమవుతునట్లుంది)
ప్రక్కనే వున్న (20 కి.మీ. దాకా వెళ్ళాలి లెండి)
రాక్షస తటాకము రాకస ప్రభంజనము
10 – రెండు రోజుల తరువాత ఎవరెస్ట్ బేస్ చేరుకున్నాం. ఇక్కడ 8వ శతాబ్దపు బౌధ్ధాశ్రమం చాలా బాగుంది. సప్తర్షులని – ఏడు గిన్నేలలొ నీళ్ళు పోసి ప్రార్థించడము గమనించాను. ఇది అన్ని ఆశ్రమాలలొ చేస్తున్నారని తరువాత అర్థమయ్యింది. సంధ్యాసమయమున ఎవరెస్ట్ ముందు ఫొటోలు అద్భుతం. ఇక్కడికి చాలా మంది స్థానిక దేశస్థులు వచ్చారు.
అల్లంతదూరములో ఎవరెస్టు
మానవమాత్రునికి అద్భుతం
పర్వతారోహునికి తీయని సవాలు
తదేకంగా చూద్దామనుకుంటున్న నాకు కన్నీరు
(ఇక్కడకి -5200 మీటర్ల ఎత్తులో, ఈదురు గాలిలో అసౌకర్యం)
ఇంక మరి, మెల్బోర్న్ రావడానికి మూడు రోజులు పట్టింది. ఇహలోకానికి చేరుకున్నాం. సంసార బంధాలు చుట్టుముట్టాయి.
ఇంత మంచి,జన్మధన్యమయ్యే యాత్రకి కారకులైన 17 మంది సహ ప్రయాణీకులకు, టిబెట్ విస్టా బృందానికి నా నమస్సుమాంజలి. నిశ్చల, నిర్మల పర్వతవాసులందరికీ శుభాభినందనలు.
శ్రీ రాజశేఖర్ రావి – మెల్బోర్న్
