ధ్వన్యనుకరణ కళానిధి నేరెళ్ళ


ధ్వన్యనుకరణ కళానిధి నేరెళ్ళ వేణుమాధవ్ – *జూన్ 19 వేణుమాధవ్ వర్ధంతి

ధ్వన్యనుకరణ కేవలం వినోద సాధనమే కాదు.. సృజనాత్మక కళ, సామాజిక చైతన్య గీతిగా తీర్చిదిద్దిన ప్రతిభాశాలి నేరెళ్ళ వేణుమాధవ్. జూన్ 19 ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన జీవన విశేషలను గుర్తుచేసుకుందాం.

వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబర్ 28న వేణుమాధవ్ జన్మించారు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఆరు భాషల్లో పండితుడు. వేణుమాధవ్ ఈయనకు పన్నెండో సంతానం. సాహిత్యంలో మంచి అభినివేశం ఉండడం వల్ల, ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్ధండులున్నారు. వీరితో జరిగిన సాహిత్య గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. తన 8 వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి, రాఘవయ్య మాష్టారు గారి వద్ద కొంతకాలం ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతిలో చేరి బోల్తా ఉభాయిదా (పెద్ద బాలశిక్ష) చదవడం ప్రారంభించారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి నాగయ్య గారిమీద అభిమానం పెంచుకున్నారు. నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించారు. ఇవే కాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది ఆయన మిమిక్రీ ప్రస్థానం.

ఏవీవీ (ఆంధ్ర విద్యాభివర్ధిని) హైస్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణ మూర్తి గారి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పురస్కారాలు కూడా లభించాయి. హాస్యనాటకాలంటే ముందుండే వారు. మిగతా గురువులు కందాళై శేషాచార్యులు, యద్దనపూడి కోదండ రామ శాస్త్రి వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు. 1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు మిగతా లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. దానితో వీరు ముప్పయి ఇంగ్లీషు సినిమాల్ని తనివిదీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు పరమానంద భరితులై “యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్” అని, ఇకనుండి నీకే అవసరం వచ్చినా నువ్వు ఎవరినీ అడగకు. నా పెద్ద కుమారుడు విఠల్ అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్’ గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. చెప్పుకోదగిన మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు,స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజుల సమక్షంలో ఇచ్చారు.

అభిమాన నటుల సినిమాలు చూసి అందులోని పాటలు, పద్యాలు, సంభాషణలు అనుకరించడంతోనే నేరెళ్ల వేణుమాధవ్‌ ధ్వన్యనుకరణ ప్రస్థానం మొదలైంది. స్వయం కృషితో సాధన చేసి ఆ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఆ తర్వాత ఆయన ఎక్కని వేదిక లేదు. వెళ్లని దేశం లేదు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన ప్రదర్శనలు తిలకించారు.
వీరికి 1977 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ “, 1987 లో జె.ఎన్.టి.యూ.సీ, 1992 లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. వీరికి తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి. వీరి బిరుదులు – ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ మున్నగునవి.

* జాన్‌ ఎఫ్‌.కెనడీ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు, బాలీవుడ్‌ దిగ్గజం పృథ్వీరాజ్‌కపూర్‌ నుంచి కరుణానిధి, ఎంజీఆర్‌ వంటివారి ప్రసంగాలను అచ్చుగుద్దినట్లు అనుకరించేవారు.
* హాలీవుడ్‌ చిత్రం ‘మెక్నాస్‌ గోల్డ్‌’ ఎంత గొప్పగా ప్రేక్షకాదరణ పొందిందో.. ఆ చిత్రంలోని సన్నివేశాలకు వేణుమాధవ్‌ ధ్వన్యనుకరణ ద్వారా అంత ప్రాచూర్యం లభించింది. ఇతర భాషల్లోని వ్యక్తులు, ఆయా సన్నివేశాలను అనుకరించడాన్ని ఆయన ‘జిబ్రిష్‌’ అని వేణుమాధవ్‌ చెప్పేవారు.
* రష్యన్‌, జపనీస్‌ వంటి విదేశీ భాషలు రాకపోయినా ఆ దేశ అధినేతలు, ప్రముఖులు మాట్లాడుతున్నారా.. అన్నంత స్పష్టంగా అనుకరించడం ఆయన ప్రత్యేకత.
* శాస్త్రీయ సంగీతం తెలియకపోయిన, పద్యం ఎలా పాడాలో తెలియకపోయిన ఆయా రంగాల కళాకారులనే ఆశ్చర్యపరిచేలా శృతిపక్వంగా పాడేవారు.
* ఏకకాలంలో అనేక రకాల చర్యలు జరుగుతున్నట్లు అనుకరించడం ఆయన ప్రత్యేకత.
* సాధారణంగా కళాకారులు ప్రదర్శనానంతరం రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులతో సత్కారాలు పొందడం చూస్తుంటాం. కానీ వేణుమాధవ్‌ ఆ పెద్దలతో సరిసమానమైన గౌరవాన్ని పొందారు.

పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ 2018, జూన్ 19వ తేదీ మంగళవారం 85వ యేట కన్నుమూశారు.

Scroll to Top