
శరీరం లో పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. ఆ వ్యర్ధాలు పూర్తిగా బయటకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో అవే కిడ్నీల్లో స్టోన్లుగా మారుతాయి. ఇవి నొప్పిని, విపరీతమైన ఇబ్బందిని కలగజేస్తాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడే సమయంలోనే శరీరం పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ లక్షణాలను పసిగట్టడంలో అప్రమత్తంగా ఉంటే కిడ్నీల్లో స్టోన్స్‌ను ముందే తొలగించుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వెనుక అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే మూత్రంలో క్యాల్షియం, ఆగ్జలేట్స్, యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్, సమ్మేళనాలు ఉంటాయి. అయితే నీళ్లను సరైన మోతాదులో తాగితే వీటిని కిడ్నీలు బయటకు పంపిస్తాయి. కానీ ఇవి కిడ్నీల్లో అధికం గా చేరితే ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో అవి స్టోన్స్‌గా మారుతాయి. ఎక్కువగా క్యాల్షియం, ఆగ్జలేట్ స్టోన్లు కిడ్నీల్లో ఏర్పడతాయి.
కిడ్నీ స్టోన్లు ఏర్పడుతున్న సమయంలో తరచూ జ్వరం వస్తుంది. కొద్ది రోజుల పాటు ఉండి తగ్గుతుంది. మళ్లీ కొన్ని రోజులకు వస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉంటే బొడ్డు కింది భాగంలో రెండు వైపులా లేదా అదే ప్రాంతంలో వెనుక వైపు కూడా నొప్పి ఉంటుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు లేదా వంగినప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువవుతుంది. ఆ ప్రాంతంలో సూదుల తో పొడిచినట్లు నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో కొందరికి వికారంగా అనిపిస్తుంది. కొందరికి వాంతులు కూడా అవుతాయి. కొన్ని రకాల పదార్థాల వాసనలు చూస్తే పొట్టలో తిప్పినట్లు అవుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే తల తిరిగినట్లు కూడా అనిపిస్తుంది. స్పృహ తప్పి పడిపోతామమో నని కూడా అనిపిస్తుంది.
మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారు మూత్ర విసర్జన చేస్తే మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్రంలో నురుగు కూడా కనిపిస్తుంది. మూత్రం ముదురు రంగులో వస్తుంది. కొందరికి మూత్ర విసర్జన సమయంలో రక్తం కూడా పడుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే నిరంతరాయంగా వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
