వీణానాదమే ఆయన జీవితం


ఈనెల 23 వీణా విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి వర్ధంతి
**********************************************
తెలుగునాట వీణా విద్వాంసునిగా గణుతికెక్కిన ప్రజ్ఞాశాలి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వీణా విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి. వీణానాదమే తన జీవితంగా గడిపిన శంకర శాస్త్రి వర్ధంతి డిసెంబర్ 23. ఈ సందర్భంగా ఆయన జీవన విశేషాలు…

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో సెప్టెంబర్ 23, 1922లో సంప్రదాయ సంగీత విద్వాంసుల కుటుంబములో జన్మించారు ఈమని శంకర శాస్త్రి. వీరి తండ్రి వైణిక భూషణ, వీణ ఆచార్య బిరుదాంకితుడైన ఈమని అచ్యుతరామ శాస్త్రి, ప్రముఖ వీణ విద్వాంసుడు సంగమేశ్వర శాస్త్రి, వీణ వెంకట రమణయ్య వీరి సమకాలీకులు. చిన్నప్పుడే తండ్రి దగ్గర పొందిన తర్ఫీదుతో వీణ వాయించడం లో మెళకువలు నేర్చుకున్నారు శంకర శాస్త్రి. తన మూడో ఏటనే సంగీతం లో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడు గానే జీవితం ప్రారంభించారు. కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో బిఏ డిగ్రీ చేశారు 19 ఏళ్ల వయస్సులోనే అంటే కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కాకినాడ దసరా వేడుకల్లో తన వీణా కచేరీతో సంగీత విద్వాంసులను సైతం మంత్ర ముగ్దులను చేసిన విశేష ప్రతిభా శాలి శంకర శాస్త్రి. ఆంధ్ర యూనివర్సిటీ లో చదువు ముగించుకున్నాక మద్రాసు లోని జెమిని స్టూడియోలో సంగీత దర్శకుడిగా చేరి దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు. అక్కడ పని చేస్తున్నప్పుడు మంగళ,సన్సార్, బహుత్ దిన్ హువా, వింధ్యరాణి, నిషాన్, మిస్టర్ సంపత్ వంటి హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించి ఆ సినిమాలలో కొత్త టెక్నిక్ లు ఉపయోగించి ట్యూన్లు కట్టారు. వీణపై వేద మంత్రాలను పలికించడం, పాశ్చాత్య బాణీని సైతం తన వీణపై వినూత్న శైలిలో పలికించడం శంకర శాస్త్రి ప్రత్యేకత.

వీరు తమ తండ్రి అచ్యుతరామశాస్త్రి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగు వీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. వీణానాదం లో అతి సున్నితంగాను, అతి గభీరంగాను… రెండు విధాలుగా ఆయన వీణానాదం ఉంటుంది. వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం… రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిదే. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడిగా నిలబడగలగటానికి కారణం ఆయనలోని ఆధునికతే. ఆ తరువాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.

కేవలం తాను నేర్చుకున్న కర్ణాటక సంగీతంలో కీర్తనలు మాత్రమే వాయించకుడా, లౌకిక ప్రపంచంతో కూడా తన సంగీతాన్ని అనుసంధానించారు. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ అధిరోహించిన వార్తను విన్న శంకరశాస్త్రి ‘ఆదర్శ శిఖరారోహణం’ అని ఒక సంగీత కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలు, తాము ఎవరెస్టును అధిరోహిస్తున్న అనుభూతిని పొందినట్లు చెప్పారు.. ఇటువంటిదే ‘భ్రమరవిన్యాసం’ అనే మరొక సంగీత రూపకం. ఈ కార్యక్రమాన్ని విన్నవారు, వారి పక్కనే తుమ్మెద ఝంకారం ఉన్న అనుభూతిని పొందారట. ఈనాడు వాద్యవిద్వాంసులు చేస్తున్న ప్రయోగాలకు ఆద్యులు శంకరశాస్త్రి. గమకాలు వేయడంలో, స్వర కంపనంలో, రాగాలాపనలో, స్వరప్రస్తారంలో, తానం వేయటంలో, ఒక మెట్టు నుంచి మరో మెట్టుకు స్వరాలు వేస్తున్నప్పుడు నిశ్శబ్దం వచ్చేలా చేయడంలో, స్వరనాదంలో హెచ్చుతగ్గులు ప్రదర్శించడంలో… సంగీతంలోని అన్నివిభాగాలలో ఎన్నో కొత్త మార్గాలను సృష్టించారు. సంగీతంలో ఉన్న గమకరీతులకు తోడు, మరో ఏడు రీతులను సృష్టించిన స్రష్ట శాస్త్రి.

కర్ణాటక సంగీతంలో గమకాలను విస్పష్టంగా నిర్వహించిన మహా విద్వాంసుడు శంకర శాస్త్రి., పంచదశ గమకములు ,దశవిధ గమకములు,గురించి భారతీయ సంగీత శాస్త్రములో విపులీకరించలేదని అలాంటి వాటిని శంకర శాస్త్రి గారు నిశితంగా అధ్యయనం చేశారని సంగీత విద్వాంసులు పేర్కొంటారు. గమకములు అనుస్వరాలు గురించి సాధికారికంగా శంకర శాస్త్రి ప్రసంగించేవారు. ఆయన వీణాకచేరీలో తన వీణపై మానవ కంఠాన్ని ముఖ్యముగా స్త్రీ కంఠస్వరాన్ని పలికించేవారు. తానూ ఏ రాగాన్ని వీణపై ఆలపిస్తున్నా శాస్త్రీయత లో ఎటువంటి భేదము లేకుండా చక్కని గమకాలతో పలికించే వారు. శంకరాభరణము, తోడి రాగం ఆలపించడం లో విశేష ప్రతిభ కనపరిచేవారు. తన వీణా కచేరీల ద్వారా సంగీత కళా కోవిదులు మాత్రమే కాకుండా ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేని సామాన్యులను కూడా ఆకర్షించేవారు . అందువల్ల ఆయన అభిమానుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది ఆయన వీణా నాదాన్ని ఆస్వాదించని సంగీతాభిమానులు అరుదేమో అని చెప్పవచ్చు. ఆరు వీణలు వాడుతూ ఆయన రూపొందించిన ఆదర్శ శిఖరారోహణం సంగీత రూపకం, అలాగే గాంధీ గురించి, సౌమ్య పురుష , నెహ్రూ గురించి భారత జ్యోతి, తుమ్మెదల రోదను వాయిద్యాల ద్వారా ఆవిష్కరించిన భ్రమర విన్యాసము సంగీత కళాఖండాలుగా శంకరశాస్త్రికి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. 1959 లో ఆల్ ఇండియా రేడియో మద్రాసు లో చేరి స్టేషన్ డైరెక్టర్ గా, నేషనల్ ఆర్కెస్ట్రా కంపోజర్-మ్యూజిక్ ఛీఫ్ స్థాయికి ఎదిగారు. శాస్త్రీయ సంగీత శాఖను చాలా కాలం ఆయన నిర్వహించారు ఆ సమయంలో ఆయన హిందీ భజనలకు లలిత గీతాలకు స్వరాలు సమకూర్చారు. హిందుస్తానీ పాశ్చాత్య సంగీతాలకు ఆకళింపు చేసుకున్న మహా సంగీత జ్ఞాని శంకర శాస్త్రి.

శంకరశాస్త్రి దేశమంతా తన వీణ కచేరీలను ఇచ్చారు. ఈస్ట్ వెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్, తాన్సేన్ ఫెస్టివల్, విష్ణు దిగంబర్ ఫెస్టివల్ వంటి ప్రతిష్టాత్మక సంగీత కచేరీలలో పాల్గొని కళారంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు ఈయన కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాలలో కూడా వ్యాపించాయి. ఉస్తాద్ హలీమ్ జాఫర్ ఖాన్, పండిట్ రవిశంకర్, పండిట్ గోలా కృష్ణ వంటి వారితో కలిసి కచేరీలు చేసి ఉత్తర హిందుస్తాన్ లోని శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు. శంకరశాస్త్రి అనేక సాంస్కృతిక విద్యా సంబంధమైన సంస్థలతో కలిసి పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగాను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యుడిగాను , మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు కర్నాటిక్ మ్యూజిక్ లో విద్యార్థులకు స్కాలర్ షిప్పుల మంజూరు చేసే కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా ఉండి జాతీయ స్థాయి అవార్డుల ఎంపికలో కీలక పాత్ర పోషించారు.

ఈయన ప్రతిభ ను గుర్తించిన న్యూయార్క్ వాసులు వీణా విర్చువసో బిరుదును 12 అక్టోబర్ 1963లో ప్రదానం చేశారు. 1973లో శంకరశాస్త్రి గారు వీణపై శంకరాభరణము రాగాన్ని ఆలపించి ఏషియన్ రోస్ట్రామ్ అవార్డు ను గెలుచుకున్నారు. ఈ సంస్థ యునెస్కో ఆధ్వర్యములో పనిచేసేది సోవియట్ యూనియన్ లోని అలామ్ అట్టా లో జరిగిన ఈ సభకు ముప్పై దేశాల సంగీత కళాకారులు పాల్గొన్నారు.శంకరశాస్త్రి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వయోలిన్ విద్వాంసుడు యెహూది మెంహుయిన్ ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రత్యేక ఆహ్వానం అందుకొని 8 జనవరి, 1974 లో ప్యారిస్ లో జరిగిన ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ పాల్గొన్నారు. అలాగే జూలై 1980 లో రోమ్ లో జరిగిన పాన్ ఏసియాటిక్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఇలా అసమాన ప్రతిభ చూపించి ఇంటా బయట గణనీయమైన గుర్తింపు పొందిన కళాకారుడు శంకరశాస్త్రి. అల్ ఇండియా రేడియోకు తన వీణ కచేరీల అనేక రికార్డులు అందజేశారు. వాటిలో రెండు లాంగ్ ప్లే రికార్డులు యునెస్కో ద్వారా మొత్తం ప్రపంచానికి అందించారు. శంకర శాస్త్రి అనేకమంది యువ కళాకారులను ప్రోత్సహించి వారిని సంగీత జగత్తుకు పరిచయం చేశారు.

ఆయనకు “వైణిక శిఖామణి, వైణిక శిరోమణి ,వీణ గాన గంధర్వ,గాన రూప కళా సరస్వతి ” వంటి బిరుదులను ప్రదానం చేశారు ఆయనకు సంగీత నాటక అకాడమీ వారు 1973 లో “మహా మహోపాధ్యాయ” బిరుదును ప్రదానం చేశారు. ఆ బిరుదును అందుకున్న మొదటి దక్షిణ భారతీయుడు శంకర శాస్త్రి. భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది. చాలా యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేశాయి. భారతదేశ ఉపాధ్యక్షుడి అధ్యక్షతన ఏర్పడిన సన్మాన కమిటీ ఆయనను సత్కరించి, ఆయన సంగీతానికి చేసిన సేవలకు గుర్తింపుగా “చతుర్ దండి పండితః ” అనే బిరుదును ప్రదానం చేశారు. చివరగా డిసెంబర్ 23,1987 లో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆయనకు కనకాభిషేకం తో ఘనంగా సన్మానించారు ఆ సభలో శంకరశాస్త్రి తన వీణ కచేరీతో శ్రోతలను ఆనందింపజేశారు. సన్మానం తర్వాత ట్రైన్ లో మద్రాసు బయలు దేరి గమ్యానికి చేరకుండానే ట్రైన్ లోనే తుది శ్వాస విడిచారు.

Scroll to Top