
సీజన్ మారినప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాటిలో జ్వరాలు, జలుబు, దగ్గు వంటివి సర్వ సాధారణం. వీటిలో ముఖ్యంగా దగ్గు వస్తే ఒక పట్టాన వదిలిపెట్టదు. అయితే దగ్గుతో బాధపడేవారు ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దగ్గు బాగా ఉన్నప్పుడు తినకూడని పదార్థాలు తింటే దగ్గు మరింత పెరుగుతుంది. అది ఊపిరితిత్తుల పైన, గొంతు పైన ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది.
దగ్గుతో బాధపడేవారు కొన్ని ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ఫ్రిజ్ లో పెట్టిన నీళ్లు, బాగా చల్లగా ఉన్న జ్యూసులు, చల్లని లస్సీలు అసలు తాగకూడదు. కూల్ డ్రింక్స్ జోలికి పోకూడదు. ఐస్ క్రీం ను అసలు తినకూడదు. దీనివల్ల గొంతులో మంట మరింత పెరుగుతుంది. బాగా ఆయిల్ లో వేయించినవి తింటే దగ్గు ఎక్కువ అవుతుంది. బజ్జీలు, పకోడీలు, బోండాలు, చిప్స్ వంటివి తింటే దగ్గు మరింత ఎక్కువవుతుంది. జీర్ణక్రియ మందగించడం కూడా దగ్గు పెరగడానికి కారణమవుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా తినకూడదు. పల్లీలు, బాదం పప్పు వంటివి తినకూడదు. డ్రై ఫ్రూట్స్ గొంతులో రాపిడిని పుట్టించి గొంతుకు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. స్వీట్లు, చాక్లెట్లు కూడా తినకూడదు. వీటి వల్ల కఫం పెరుగుతుంది.
దగ్గుతో బాధపడేవారు ముఖ్యంగా పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. దగ్గు తగ్గేవరకు పెరుగు తీసుకోకూడదు. ముఖ్యంగా పొడి దగ్గుతో బాధపడేవారు గొంతు పొడిబారి పోయే ఆహారాలను తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో నియమాలు పాటించినా వారం రోజుల తర్వాత కూడా దగ్గు తగ్గకపోతే సమీపంలో ఉన్న డాక్టర్ ని సంప్రదించడం అవసరం.
