జావలతో జవసత్వాలు


శీతాకాలంలో ఎక్కువ మంది రకరకాల సూపులు తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి కాలంలో వివిధ రకాల జావలు తాగడం ఆరోగ్యానికి అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మార్చి నెలలోనే ఉగాదికి ముందే ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలతో ఇబ్బందులు తప్పేలా లేవు. సరైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఎండల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవటం చాలా అవసరం. ఈ సమయంలో కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలతో పాటు శరీరానికి బలం ఇస్తూ వేసవి నుంచి కాపాడే జావలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా రాగి జావ, బార్లీ జావ వంటివి ఎంతో మేలు చేస్తాయి.

రాగి జావ:
రాగుల్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు దృఢం గా ఉంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఏ,బీ,సీ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రాగుల్లో మినరల్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి. రక్తహీనత నివారణకు, మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గడానికి రాగులు మంచి ఆహారంగా పనిచేస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రాగుల్లో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు అధికంగా రాగి జావ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బార్లీ జావ:
బార్లీ జావ వేసవిలో మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒక కప్పు బార్లీ గింజలను ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకోవాలి. తాగేటప్పుడు నిమ్మరసం వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచి కావాలంటే దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. బార్లీ జావ లో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే త్వరగా ఆకలి వేయదు. బరువును నియంత్రిస్తుంది. జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్న వారు, ప్రధానంగా మూత్రపిండాల సమస్యలు ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు ఈ జావలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Scroll to Top