అంతా రామమయం


హిందూ విశ్వాసాలలో కీలకమైన పర్వదిన శ్రీరామ నవమి. త్రేతాయుగంలో ఛైత్ర శుద్ధ నవమి రోజున, వసంత బుుతువు కాలంలో, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణ కథనం. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన శుక్రవారం నాడు శ్రీరామ నవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని.. అందుకే పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం, విష్ణువు ఏడో అవతారమే శ్రీరాముడు. తనకు చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు వంటివి లేవు. అందుకే శ్రీరాముని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. అందుకే శ్రీరామ నవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు.

రామ నవమి రోజే సీతారాముల కళ్యాణం
రామాయణంలో శ్రీరామునికి వశిష్ట మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం అంటే.. యోగీశ్వరులు ఏ దేవుని నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామ నవమి రోజున రామ నామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్య ఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీ రామ నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకే రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు.

పూజా క్రమం
నవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇంట్లో మామిడి ఆకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరగా అన్నదానం చేయాలి. ‘రామ’ అనే రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఒక్క నామం తో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.

విశిష్టత తెలిపే శ్లోకాలు
శ్రీరామ నవమి రోజున రాముని విశిష్టత తెలిపే ఈ శ్లోకాలను పఠించి రాముని జీవితం ఆదర్శంగా తీసుకోవాలని పండితులు చెబుతారు. .
“ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్” ఈ శ్లోకాలను పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు సుందరకాండను కూడా పఠించాలి.

దాన ధర్మాలు
శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదే విధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులు దానం చేయాలి. దీని వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

Scroll to Top