అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తో గుండెకు చేటు!


ప్యాక్ చేసిన రెడీ-టు-ఈట్ ఆహారాలు తినడం ఈ రోజుల్లో అతి సాధారణమైపోయింది. వీటిని అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఇవి చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, వంటి రూపాల్లో ఉండి ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. యూరోపియన్ కార్డియాలజీ నివేదిక ప్రకారం, ఇవి కేవలం నోటికి రుచి తప్ప ఆరోగ్యానికి అత్యంత హానికరమని తేలింది. వీటిని ఎక్కువగా తీసుకునే వారికి గుండె జబ్బులు, షుగర్, బీపీ రావడమే కాకుండా.. ప్రాణాపాయం కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా కంపెనీలు తమ ఆహార ఉత్పత్తులు “ఆరోగ్యకరం” అని ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ పరిశ్రమల్లో తయారయ్యే ఈ ఆహారాలలో చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు, రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియలను దెబ్బతీస్తాయి, లోపల మంటను కలిగిస్తాయి. ఇంకా ఇంకా తినేలా ప్రేరేపిస్తాయి.

యూరోపియన్ హార్ట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారిలో.. గుండె జబ్బుల ప్రమాదం 19% ఎక్కువగా ఉంది. గుండె లయ తప్పే ముప్పు 13% ఉంది. గుండె సంబంధిత మరణాల ముప్పు ఏకంగా 65% ఎక్కువగా ఉందని తేలింది. నిపుణుల బృందం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని చెబుతోంది. డాక్టర్ల దగ్గరకు వచ్చే రోగులతో వారు ఏం తింటున్నారు? ఎంతవరకు ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటున్నారు? అనే విషయాలను చర్చించి, వాటిని తగ్గించేలా సలహాలు ఇవ్వాలని సూచించారు. కేవలం పోషకాలను చూడటమే కాదు, ఆహారాన్ని ఎంతగా ప్రాసెస్ చేశారనేది కూడా ముఖ్యమని వారు నొక్కి చెబుతున్నారు.

యూరప్ దేశాల్లో నెదర్లాండ్స్, యూకే వంటి దేశాల్లో జనం తమ ఆహారంలో సగానికి పైగా ఈ హానికరమైన వస్తువులనే తింటున్నారు. అందుకే ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తేవాలని, ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద స్పష్టమైన లేబుల్స్ ఉండాలని పరిశోధకులు కోరుతున్నారు. సాధ్యమైనంత వరకు తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడం, ప్యాకెట్లలో దొరికే వస్తువులకు దూరంగా ఉండటమే గుండెకు సురక్షితం అని వివరిస్తున్నారు.

Scroll to Top