
వెండితెర పౌరాణిక బ్రహ్మ ఈ కమలాకరుడు
*జూన్ 29 కమలాకర కామేశ్వరరావు వర్ధంతి
****************************
తెలుగు ప్రేక్షకులకు తన సినిమాలతో భక్తి మార్గం పట్టించిన ఘనుడు. పౌరాణిక చిత్ర బ్రహ్మగా గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఈనెల (జూన్) 29 ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను గుర్తుచేసుకుందాం.
కమలాకర కామేశ్వరరావు 1911 అక్టోబర్ 4 న బందరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది. బందరు నోబుల్ కాలేజీలో 1933లో బి.ఏ. పాసయ్యారు.
ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రెండే కాలేజీలు…. మద్రాసులో లేదంటే మచిలీపట్టణంలో చదవాలి. ఏ ఉద్యోగానికీ ప్రయత్నించలేదు. చిత్రాల్లో ప్రవేశించాలనేది ఆయన ధ్యేయం. ఆ ధ్యేయంతోనే సినిమాలు చూస్తూ చిత్రాలకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ వుండేవారు.
అప్పటికే ఆయనకు సినిమా టెక్నిక్ మీద మంచి ఉత్సాహం ఏర్పడింది. వచ్చిన ప్రతి చిత్రం భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసేవారు. చూసి ఊరుకోక ఫిల్మ్ టెక్నిక్ కు సంబంధించిన పుస్తకాలు తెప్పించి చదవడం ప్రారంభించారు. స్వతహాగా ఉన్న ఆసక్తికి ఇలా పుస్తకాల ద్వారా పొందిన విజ్ఞానం తోడవడంతో ఆయన విడుదలైన సినిమాల మీద విమర్శలు వ్రాయడం ఆరంభించారు.
కృష్ణా పత్రిక లో ‘సినీఫాన్’ అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసేవారు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూథియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి.
బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవారు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా ఉన్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా ఉన్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి. తెలుగు, హిందీ సినిమాలే గాక ఆంగ్ల చిత్రాల గురించి కూడా వ్రాసేవారు. ‘గుడ్ ఎర్త్ ‘ అనే సినిమా లోని గొప్పతనాన్ని గురించి వరుసగా నాలుగు సంచికల్లో వ్రాశారు.
ఆయన సినిమా విమర్శలకు ఎంతో విలువ ఉండేది. ఆ విమర్శలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా ఉండేవి. ఆ విమర్శలను చదివి, వాటిలో ‘బాగుంది’ అని రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, బాగలేదని రాస్తే చూడని వాళ్ళు కూడా ఉండేవారు. కృష్ణా పత్రిక స్థాపకుడు, సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు కామేశ్వరరావు గురించి “మా సినీ ఫ్యాన్” అని గర్వంగా చెప్పేవారు.
ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన “ద్రౌపదీ వస్త్రాపహరణం”, “ద్రౌపదీ మానసంరక్షణం” చిత్రాలను రెండింటినీ సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరుసగా నాలుగు సంచికలలో రాసిన విమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఎందుకంటే ‘వస్త్రాపహరణం’ ఆర్థికంగా విజయవంతమైంది; ‘మానసంరక్షణం’ దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం ‘మానసంరక్షణం’ ‘వస్త్రాపహరణం’ కంటే మంచి చిత్రమని ప్రశంసించారు. వస్త్రాపహరణం లోని లోటు పాట్లు విమర్శించారు. వస్త్రాపహరణం లో నాటి ప్రముఖ స్టేజి నటులంతా నటించారు. బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలనే ఆ సినిమాలో వాడారు. హెచ్. ఎం. రెడ్డి ఆధ్వర్యంలో హెచ్.వి.బాబు దర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది.
ఇక మానసంరక్షణం చిత్రానికి ఎన్.జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో దుర్యోధన పాత్ర ధరించింది బళ్ళారి రాఘవ కాగా అందులో యడవల్లి సూర్యనారాయణ. కథ నడిపిన విధానం, నటన మానసంరక్షణంలో బాగున్నాయని కామేశ్వరరావు వ్రాశారు. ఈ విమర్శలను నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి ప్రముఖులందరూ ప్రశంసించారు. రామబ్రహ్మం ‘వస్త్రాపహరణం’ సినిమాలో పనిచేశారు. అయినా కామేశ్వర రావు విమర్శలను మెచ్చుకున్నారు. హెచ్. ఎం. రెడ్డి ఆధ్వర్యంలో హెచ్.వి.బాబు దర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది. ‘వస్త్రాపహరణం’, ‘మానసంరక్షణం’ చిత్రాల మీద రాసిన విమర్శలే కామేశ్వరరావును చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేలా చేశాయి.
హెచ్.ఎం.రెడ్డి ‘కనకతార’ సినిమా తీస్తున్న రోజుల్లో కామేశ్వరరావు మద్రాసు వెళ్లారు. ‘మానసంరక్షణం’, ‘వస్త్రాపహరణం’ చిత్రాల మీద తాను రాసిన విమర్శలు చూపించారు – “వస్త్రాపహరణం” సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి కి. విమర్శలు పూర్తిగా చదివి హెచ్.ఎం.రెడ్డి ఆయనను అభినందించారు. “చాలా బాగుంది” అని మెచ్చుకున్నారు. పైగా తన సినిమాను విమర్శించి, దానికి పోటీగా ఇంకొకరు తీసిన సినిమాను ప్రశంసించిన కామేశ్వరరావుకు ఉద్యోగమివ్వడానికి సిద్ధపడ్డారు.
గృహలక్ష్మి సినిమా ప్రారంభానికి ముందు కామేశ్వరరావు మద్రాసు చేరుకుని రోహిణీ సంస్థలో చేరారు. రోహిణీలో చేరడంతో ఆయనకు పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు పరిచయమయ్యారు. కామేశ్వరరావుకు ఆ సినిమాలో జీతమేకాదు, పని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఏదో ఒక సినిమా చూసేవారు. రాత్రయాక కె.వి.రెడ్డి, ఆయనా ఆ సినిమా గురించి చర్చించుకునేవారు. గృహలక్ష్మి చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరారు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు. వాహినీవారి దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పని చేశారు. ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో కామేశ్వరరావు ఒకరు.
బందరులో కామేశ్వరరావుకు పింగళి నాగేంద్రరావుతో పరిచయమైంది. కామేశ్వరరావు ఆయనను కె.వి.రెడ్డికి, బి.ఎన్.రెడ్డికి పరిచయం చేశారు. అలా తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన రచయితను పరిశ్రమకు పరిచయం చేసింది కూడా కామేశ్వరరావేనని చెప్పవచ్చు. అంతలో కారణాంతరాల వల్ల వాహినీ స్టూడియో చేతులుమారి విజయా సంస్థ స్టూడియోను నిర్వహించసాగింది. విజయా వారు కామేశ్వరరావును కూడా తమ సంస్థ లోకి తీసుకున్నారు. తొలుత విజయా వారి పాతాళభైరవి సినిమాకు ఆయన పనిచేశారు. తర్వాత విజయా వారే నిర్మించిన చంద్రహారం సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం విజయావారి మునుపటి చిత్రాల వలె ఆర్థికంగా విజయవంతం కాలేకపోయింది. కానీ విమర్శకుల మెప్పును మాత్రం పొందింది. ఆ చిత్రంలోని టెక్నిక్ కు ఎందరో విమర్శకులు జోహార్లర్పించారు. ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలు విదేశాల్లో టెలివిజన్ లో ప్రసారమయ్యాయి.
పాండురంగ మహత్యం, గుండమ్మ కధ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ తులాభారం, బాల భారతం లాంటి ఎన్నో అపురూపమైన పౌరాణిక, సాంఘిక చిత్రాలను మనకి అందించిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు సదా చిరస్మరణీయులు.
“చలన చిత్రంలో అన్ని శాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించకూడదని నా ఉద్దేశ్యం. అన్ని శాఖలూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం.” అని కమలాకర కామేశ్వరరావు చెప్పేవారు. ఇంతటి మహోన్నత ఆదర్శమూర్తి జూన్ 29, 1998న తన 88 వ ఏట కాలధర్మం చెందారు.
