
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. కొన్నేళ్ల క్రితం వరకు ఫ్యాటీ లివర్ కేవలం అధికంగా మద్యం సేవించేవారిలో కనిపించేది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వేగంగా పెరుగుతోంది. అంటే మద్యం తాగని వారిలో కూడా ఫ్యాటీ లివర్ ముప్పు ఎక్కువ అయింది. ఫ్యాటీ లివర్‌ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కాలేయం డ్యామేజ్ అయ్యే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. లైఫ్‌స్టైల్‌తో పాటు తినే ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను నివారించవచ్చని సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో ఆల్క్‌హాల్ తాగనివారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, షుగర్ ఫుడ్స్ తీసుకోవడం, శారీరక శ్రమకు దూరం అవ్వడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. చాలా మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నారు, దీనిని ఇప్పుడు మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ అని పిలుస్తున్నారు.ఇక, లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉసిరికాయ, నేరేడు పండు అద్భుతంగా పనికొస్తాయని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. కాలేయంలో కొవ్వు చేరడం (గ్రేడ్-1 ఫ్యాటీ లివర్) అనేది ఒక హెచ్చరిక లాంటిది. మన శరీరం కొవ్వులను, చక్కెరలను సరిగ్గా అరిగించుకోలేకపోతోందని ఇది సూచిస్తుంది. కేవలం ఏదో ఒక పండు తింటే ఇది తగ్గిపోదు, కానీ సరైన జీవనశైలితో పాటు ఉసిరి, నేరేడులను మన డైట్‌లో చేర్చుకుంటే లివర్ ఆరోగ్యం త్వరగా మెరుగవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉసిరికాయ కాలేయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్-సి, పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయం లోని కణాల వాపును తగ్గిస్తుంది. లివర్‌లో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపి, కొవ్వును కరిగించడంలో సాయపడుతున్నాయి.
నేరేడు పండు మెటబాలిక్ బ్యాలెన్సర్ గా గుర్తింపు పొందింది. ఫ్యాటీ లివర్ రావడానికి ముఖ్య కారణం ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం). ఇక్కడే నేరేడు పండు అద్భుతంగా పనిచేస్తుంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది. లివర్ దెబ్బతిన్నప్పుడు పెరిగే ఎంజైమ్‌ల్ని అదుపులో ఉంచుతుంది. షుగర్ కంట్రోల్ అవ్వడం వల్ల లివర్‌లో కొత్తగా కొవ్వు చేరదు. ఉసిరి లివర్‌ను శుభ్రపరిస్తే, నేరేడు పండు కొవ్వు చేరకుండా చూస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడమే సరైన పద్ధతి.
రోజుకు 5 నుంచి 7 నేరేడు పండ్లు, కొద్దిగా నీళ్లలో కలిపిన ఉసిరి రసం తీసుకోవడం సరిపోతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం పూట తీసుకోవడం వల్ల శరీరం వీటిలోని పోషకాలను బాగా గ్రహిస్తుంది. జంక్ ఫుడ్స్ తింటూ, వ్యాయామం చేయకుండా కేవలం ఈ పండ్లు తింటే ఫలితం ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తో పాటు వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
