
వాగ్గేయకార వైభవంగా ‘స్వరసాధన’ 18 వ వార్షిక సంగీతోత్సవం: శతాబ్దాల నాటి అపురూప సంగీత రచనల ఆలాపనతో అలరించిన విద్యార్థులు
స్థానిక కీస్బరో సమీపంలోని చ్యాండ్లర్ కమ్యూనిటీ సెంటర్ (28 ఐజాక్ రోడ్) వేదికగా జూలై 25, 2026 శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రముఖ మెల్బోర్ను సంగీత శిక్షణాలయం ‘స్వరసాధన’ వారి 18వ వార్షిక సంగీతోత్సవం ‘వాగ్గేయకార వైభవం’ అనే ఇతివృత్తంతో విజయవంతంగా నిర్వహించబడింది. సంస్థ అధినేత్రి, సంగీత విదుషీమణి గురువు శ్రీమతి సుందరి సరిపల్లె గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కచేరీలో విద్యార్థులు శతాబ్దాల నాటి ప్రాచీన రచనల నుండి ప్రస్తుత కాలపు కీర్తనల వరకు ఎంతో వైవిధ్యభరితమైన సంగీత రూపాలను ప్రదర్శించి శ్రోతలను ఆకట్టుకున్నారు.
ప్రత్యేకాంశాలు:

విజయనగర అపురూప సంగీత వారసత్వం: విశిష్టమైన ప్రసిద్ధ కర్ణాటక సంగీత బాణీ కి నిలయమైన విజయనగరంలో శాస్త్రీయ సంగీత అభ్యాసం చేసిన శ్రీమతి సుందరి సరిపల్లె గారు, ఈ కచేరీలో ఆ ప్రాంతపు అరుదైన పూర్వకాలపు వాగ్గేయకారుల కీర్తనలను తమ విద్యార్థులచే అద్భుతంగా ఆలపింపజేశారు. ఇందులో భాగంగా విజయనగర వాస్తవ్యులైన హరికథా పితామహుడు శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి హరి కథలలోని అరుదైన ఒక కీర్తనను విద్యార్థులు ఆలపించడం ఒక విశేషం .

గురు సంస్మరణ కృతి సమర్పణలు : సుందరి సరిపల్లె గారి ప్రథమ గురువులైన శ్రీ శిష్ట్లా సత్య రాజశేఖరమ్ గారి అపురూప తెలుగు తిరుప్పావై సంగీత రచనలను కీర్తనలను విద్యార్థులు శాస్త్రోక్తంగా ఆలపించారు.అలాగే శ్రీమతి సుందరి గారికి సంగీత విద్యాబోధన చేసిన మరో గురువు, ‘తిరుప్పగళ్’ ఖ్యాతి శ్రీ బొంబాయి బాలసుబ్రహ్మణ్యన్ (తిరుప్పగళ్ బాలు) గారి అరుదైన కృతిని కూడా ఈ కార్యక్రమంలో ఆలపించి విద్యార్థులు తమ గురు పరంపరకు స్వరార్చన గావించారు.
యుగయుగాల వాగ్గేయకారుల వైభవం (సంగీత త్రిమూర్తులకు పూర్వ మరియు తర్వాతి కాలపు): కచేరీలో సంగీత త్రిమూర్తులకు పూర్వకాలపు భక్త రామదాసు, అన్నమయ్య సంకీర్తనల నుండి
ప్రారంభించి, ఆర్ష సంప్రదాయ కర్ణాటక సంగీత త్రిమూర్తులు (త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి) దివ్య కృతులను ఆలపించారు. అలాగే సంగీత త్రిమూర్తులకు తర్వాతి కాలపు ప్రముఖ వాగ్గేయకారులు, ముఖ్యంగా త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన వారు రచించిన అనేక విలక్షణమైన వర్ణాలు, స్వరపల్లవులు, కీర్తనలను విద్యార్థులు ఎంతో చక్కగా ఆలపించారు. దీనితో పాటు పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భజనలను కూడా విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ఆలపించారు.
తోటి విద్యార్థుల పక్కవాద్యాల సహకారం: ‘స్వరసాధన’ విద్యార్థుల గాత్ర కచేరీకి స్థానిక వయలిన్, మృదంగం, వేణుగాన (ఫ్లూట్) పాఠశాలలకు చెందిన విద్యార్థులు పక్కవాద్యాల సహకారం అందించారు. వారి వారి గురువుల శిక్షణ, ప్రోత్సాహంతో ఈ విద్యార్థులు అందించిన వాయిద్య సహకారం కచేరీని చక్కగా నడిపించింది.
కచేరీ ప్రత్యేకత – విద్యార్థుల రాగ వివరణ: ఈ కచేరీలో కీర్తనలు పాడుతున్న విద్యార్థులే స్వయంగా ఆయా రాగాల వివరాలను, వాటి స్వర స్థానాలను (Scales) సభకు వివరించి పాడారు. మరోపక్క కార్యక్రమ వ్యాఖ్యాత వాగ్గేయకారుల విశిష్టతను వివరించగా, డిజిటల్ స్లైడ్స్ పై ఆయా వాగ్గేయకారుల చిత్రపటాలను ప్రదర్శించారు.
ఐదు గంటల పాటు సాగిన ఈ సంగీత కార్యక్రమంలో సంగీత ప్రియులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను, గురువు సుందరి సరిపల్లె గారి కృషిని అభినందించడంతో కార్యక్రమం ఘనంగా ముగిసింది.

