సంక్రాంతి లక్ష్మి

స్వాగతం స్వాగతం ,సంక్రాంతి లక్ష్మికి
రెండువేల పదునాలుగు స్వాగతం,
వరికంకులొక చేత , సిరిసంపదలొ కచేత
ఎర్రకలువ మరియొక చేత,
శాంతి సౌభాగ్యములు వేరొకచేత
పట్టి ,విచ్చేయు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం.

మంచువలువలు కట్టి,
పచ్చని పంట చేలపై విహరించి,
పాడి పంటల పండించి
గాదెలు గల్లాపెట్టెలు నింపు
ధన ధాన్య లక్ష్మిగా అరుదెంచు,
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం.

వేకువఝామున మంచు సొనలలో,
ఇల్లిల్లు తిరుగు “హరిలోరంగహరి”
పాటల హరిదాసుల మేలుకొలుపులు,

ముచ్చటైన ముంగిళ్ళ ముద్దుగుమ్మలు
దిద్దిన రంగు రంగుల రంగవల్లులు ,కన్నెపిల్లల
బంతిపూలాలన్కరణల గొబ్బిళ్ళు, స్వాగతం

పచ్చతోరణాలు ,పసుపుకుంకుమల గడపలు,
బాలురందరూ ఇంటింట తిరిగి దండిన కర్రలు,
బాలికలందరు కూర్చిన పిడకల దండల
భోగిమంటలు భయాందోళనలు పారద్రోలు
భగ భగ మండే భోగిమంటలు,
పిన్నపెద్దలందరు చుట్టూ జేరి
చలికాచుకొను భోగిమంటలు
అభ్యంగనస్నానాలు , నూతనవస్త్రాలంకారాలు,
అత్తవారిళ్ల కొత్తల్లుళ్ళ ఆగమనాలు,

విందు వినోదాలు భోగిపండుగ,
పసిపిల్లల చీడపీడలు తొలగ,
చెరుకుముక్కలు, చిల్లరపైసలు,
రేగుపండ్లు, సెనగలు మేళవించి
దిష్టితీసి పోయు వేడుకలు ,పిలుపులు,
పేరంటాళ్ళు భోగిపండగ,
షడ్ర సోపేత వంటకాలు,
పురుష పుంగవుల పేకాట,పిచ్చాపాటీలు,
ముత్తైదువలు పసుపుకుంకుమల పంచిపెట్లు
పట్టుచీరల రెపరెపలు,ధగధగలు,
కన్నెపిల్లల పరికిణి వోనీల మెరుపులు,
వన్నెచిన్నెలు,
బాలబాలికల హడావిడి హంగామాలు,
విందు వినొదాలు సంక్రాంతి సందళ్ళు
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

జిల్లేడాకు రేగిపళ్ళు
తలపైనుంచుకుని
తలార స్నానమాచరించు వైనం
” కనువునాడు మినుము “అను నానుడిని,
మిన్పగారెలు,బూరెలతో
విందు, భోజనాలు,
డూడూ బసవన్న అంటూ
గంగిరెడ్లవారి బాజాలు బాకాలు,
తీర్థాలు,తిరునాళ్లలో
పంచాదార చిలకలు పొంగులు,
పనసకోసాలు, ఖర్జూరాలు,
బొమ్మలు బూరాలు,
బట్టలు గాజులు పూసలు వగైరా అంగళ్లు
రంగులరాట్నము ,గరిడిసాములు,
గంగిరెడ్ల మువ్వల సవ్వడులు,
విందు వినోదకనుమ వేడుకలు,
మూడుదినాల సంక్రాంతి పండగ

వేడుకల “సంక్రాంతి లక్ష్మి”కిదే స్వాగతం
రెండువేల పదునాలుగు వత్సర స్వాగతం

————————————————————————

కామేశ్వరి సాంబమూర్తి .భమిడిపాటి
Balwyn North , Melbourne

Scroll to Top