మలేషియా ఎయిర్ లైన్స్ లో మెల్బోర్న్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి, టాక్సీ లో మౌలాలి ఉన్న అన్న ఇంటికి చేరుకున్నాను. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఆటో ఎక్కి సికింద్రాబాద్ ఆనంద్ భవన్ లో మంచి మసాలా దోస తిని, వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగి బయటకు వచ్చాను.
ప్రక్కనే ఉన్న పాన్ షాప్ లో మంచి మీటా పాన్ పట్టించి, ఒక గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టు వెలిగించి వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాను. ఎంత మారిపోయింది సికింద్రాబాద్! ఇన్ని ఏళ్ళలో, పాత రోజులు మెల్లిగా గురుతు కొస్తున్నై. ఇంటర్మీడియట్ లో క్లాసులు ఎగ్గొట్టి మనోహర్ టాకీస్, అంజలి టాకీస్ లో మార్నింగ్ షౌస్ చూసిన రోజులు ఇంకా ఎన్నో జ్ఞాపకాలు.
బాబు ధర్మం చెయ్యండి బాబు, భోజనం తిని రెండు రోజులు అయ్యింది అని హోటల్ ముందు అడుక్కొనే ముసలి వాడి అరుపు తో జ్ఞాపకాలు చెదిరిపోయాయి.
ఎన్నో ఏళ్ళు ఆస్ట్రేలియాలో ఉండటం వలన కొంచెం మనుషుల మీద జాలి దయ ఇత్యాది గుణాలు అబ్భినై .ఆకలి అని అరుస్తున్నాడు, శుభ్రంగానే ఉన్నాడు, హోటల్ లోపలకి తీసుకు వెళ్లి భోజనం పెట్టిద్దాం అనుకుని అతనిని పిలిచి చెప్పాను.
అయ్యా వద్దు సారు, హోటల్ వాళ్ళు మమ్మలిని లోపలికి రానియ్యరు. నాకు సరిపడా డబ్బులు ఇస్తే మా హోటల్ కి వెళ్లి తింటాను అన్నాడు. డబ్బులు ఇస్తాను కానీ నాకు మీ హోటల్స్ గురించి చెప్పు అని అడిగాను.
తన పేరు రాములు అని చెప్పటం మొదలెట్టాడు.
మీకు ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి కామత్ హోటల్స్, బాబాయ్ మెస్ లు ఎలా ఉన్నాయో, మహా నగరములో భిక్షగాళ్ళ కోసం ప్రత్యేకమైన హోటల్స్ నడుస్తున్నై. పగలంతా అడుక్కున్న పైసలని కూడ పెట్టుకుని మా వాళ్ళు ఆయా హోటల్స్ కి చేరు కుంటారు. వాళ్ళు కోరు కున్న తిండి అక్కడ దొరుకుతుంది. అది కూడా చాల తక్కువ ధరకి మంచి రుచికరమైన భోజనం దొరుకుతుంది.
ఈ హోటల్స్ జంట నగరాలలో అక్కడక్కడ ఉన్నప్పటికీ, సికింద్రాబాద్ లో నాలుగు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి చెందినవారు నడుపుతున్నారు. పారడైస్ సెంటర్, ఫీల్ ఖానా, మెహబూబ్ కళాశాల దగ్గర ఈ బెగ్గెర్స్ హోటల్స్ ఉన్నాయ్. ప్రజలు రోజు ఈ దార్ల లో పగలు తిరిగిన కనిపించవు. రాత్రి మాత్రమే ఉంటాయి.. అక్కడ మాములు హోటల్స్ మల్లే బోర్డులు, మెనూలు గట్ర ఉండవు. ఫుట్ పాత్ పైనే వరుసగా మెనూ డిష్ లు పెట్టుకుని కూర్చుంటాడు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఫుట్ పాత్ హోటల్ మాత్రమే పగలు నుంచి రాత్రి వరకు ఉంటుంది.
రాములు చెప్పి చెప్పి అలిసి పోయాడు. ప్రక్కనే ఉన్న బేకరి నుంచి బన్నులు తెచ్చి తినమని చెప్పాను. తిన్న తరువాత మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు.
నగరంలో వివిధ కూడళ్ళలో అడుక్కున్న వారు రాత్రి ఏడు గంటలు నుండి హోటల్ కి చేరు కుంటారు. ప్లేట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొంతమంది రిచ్ బిచ్చ గాళ్ళు వాళ్ళ ప్లేట్స్, గలాసులు వాడుతారు.
పచ్చడన్నం దగ్గర నుంచి పప్పు అన్నం వరకు అమ్ముతారు. మాములు రోజుల్లో చికెన్, చేప , ఎగ్ కర్రీసు కూడా దొరుకుతాయి. ఆది వారాల్లో చికెన్ బిరియాని, కిచిడి కూడా తినవచ్చు. బిచ్చ గాళ్ళు తమ వాళ్ళకు పార్టీ ఇవ్వాలనుకుంటే ,ఆర్డర్ ఇచ్చి స్పెషల్ ఐటమ్స్ చేయించు కుంటారు.
ఎన్నో ఏళ్ళుగా ఈ బెగ్గెర్స్ హోటల్ నడుపుతున్న బాలకృష్ణ తమ తాతల కాలం నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పాడు.
నలభై ఏళ్ళ క్రితం వాళ్ళ తాత హోటల్ కి వెళ్ళాడట, అదే సమయంలో అక్కడకు ఇద్దరు బిక్ష గాళ్ళు రావటం, ఆ హోటల్ ఓనర్ వాళ్ళని తరిమేయటం చూసిన ఆయన మనస్సు చలించి బెగ్గెర్స్ కి హోటల్ సదుపాయం కల్పించి ఆదుకోవాలని అనుకున్నాడట. అనుకున్నదే తడవగా మొదట క్లాక్ టవర్ ఫుట్ పాత్ మీద ప్రారంభించాడట. ఆ తరువాత ఆయన కొడుకులు నాలుగు ఫుట్ పాత్ బ్రాంచ్ లు ఓపెన్ చేసి సేవలు అందిస్తున్నారు.
సేవలు అంటే ఉచితంగా అనుకుంటారు. అతి తక్కువ ధరలో కోరుకున్న భోజనం అమ్ముతారు. క్లాక్ టవర్ ఫూట్పాత్ హోటల్ ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు నడుపుటరంతా. దూర ప్రాంతాల నుంచి పగటి పూట ఇబ్బంది పడే వాళ్ళకి , మిగత బ్రాంచ్ హోటల్స్ రాత్రి మాత్రమే నడుస్తాయి.
మరి వాళ్ళు అంతా పగటి పూట ఏవిటి తింటారని రాములుని అడిగా. సారు ముష్టి పగటి పూటే అడుక్కోవాలి కాబట్టి , బ్రెడ్ ముక్కలు తింటూ ఉంటాం. అందుకే చాల మంది మా వాళ్ళు రాత్రి పూటే భోజనం చేస్తాం అని చెప్పాడు. అయ్యా బాలకృష్ణ సారు మా దగ్గర సంపాదన తో పెద్ద ధనవంతులు కావాలని అనుకోరు, అందుకే వారు బ్రతికే లాభార్జున చూసుకుని తక్కువ ధరలకే భోజనం పెడుతున్నారు.
రాములు మరి నాసిరకం భియ్యం పెడతారు కదా మీకు తినడానికి అంటే, బాబు మీ పెద్ద వాళ్ళ హోటల్స్ లో కల్తీ ఉండవచ్చు కానీ బాలకృష్ణ సారు వాళ్ళు మాత్రం మంచి బియ్యం తో చేసిన భోజనం పెడతారు. చికెన్ భోజనం 11 రూపాయలు, ఎగ్ కర్రీ తో 9 రూపాయలు, బిరియాని 18 రూపాయలు, పలావ్ 20 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉండరు, హాయిగా తినవచ్చు. మా వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి.
ఫుట్ పాత్ హోటల్స్ నడుపుతున్న బాలకృష్ణ అన్న వాళ్ళ బంధువులు ‘దేవుళ్ళు’ సారు, వాళ్ళని దేవుడు చల్లగా చూడాలి, మా కడుపు నింపు తున్నాడు, డబ్బులు తక్కువైతే, అప్పుకూడా ఇస్తాడు మహారాజ్. అంటూ దీవించాడు.
నాకు కథ కు సరిపడా కొత్త విషయాలు చెప్పినందుకు, రాములు చేతి లో రెండు వందలు పెట్టి, అక్కడి నించి క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఆ మహారాజ్ బాలకృష్ణ ని చూసి, సికింద్రాబాద్ స్టేషన్ చేరాను.
వ్యాపారం లో కొంచెం సేవ కూడా ఉండాలనేందుకు నిదర్శనమే ఈ ‘బెగ్గర్స్ హోటల్స్’