పిలుపు

గడప దగ్గరే ఆగిపోయావే.. నట్టింట్లోకి రా..
కన్నుల దగ్గరే ఉండిపోయావే.. గుండెల వరకూ రా..

ఈ దారి పొడవునా పూలూ, ముళ్ళూ, అక్షరాలూ
మత్లా దగ్గరే ఉండిపోయేవ్… మక్తా వరకూ రా..

పట్టెడన్నం ఎలా పుడుతుందో మరచిపోయావ్ నువ్వు
మడికట్టపై నిలబడి చూడకు, పైరు నాటుదువు రా..

ఆత్మావలోకనం అన్నావ్.. అద్దానికి అటువైపే ఉన్నావ్..
చూడాల్సింది చాలా ఉంది.. ఇటువైపుకు రా..

నిను కదిలించే, నను కరిగించే ప్రాణస్పందన ఒకటేరా..
చర్మం దగ్గర చూపును ఆపకు.. ఎముకల వరకూ రా..

కడలి కడుపులో దాచుకున్న ఉప్పెనలు ఎన్నెన్నో
తీరం నుండి కనబడవు, అలలకంచెను తెంచుకు రా..!
– అంజలి

Scroll to Top