
హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఛాంపియన్’ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘గిరా గిరా’ విడుదలైంది. మిక్కీ జే మేయర్ స్వరాలు, రామ్ మిరియాల గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ గ్రామీణ సాంగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, హీరోయిన్ అనస్వర రాజన్ ‘తాళ్లపూడి చంద్రకళ’గా పరిచయమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు మేక రోషన్ . ‘పెళ్లిసందడి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు నటనలో మెరుగులు దిద్దుకుంటూ క్రమంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కెరీర్లో కీలక అడుగుగా భావిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ ఛాంపియన్ ’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రోషన్ నటించడం ఆసక్తిగా మారింది.
ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఛాంపియన్’ చిత్రాన్ని స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. పీరియాడిక్ వాతావరణం, గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ ఎమోషన్స్ అన్నీ కలిసి ఈ సినిమా యూత్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కాసర్ల శ్యామ్ – రామ్ మిరియాల కాంబినేషన్ ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేపుతోంది. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు సహజత్వం, మట్టి మనుగడను ప్రతిబింబిస్తూ హిట్ అవుతుంటాయి. దసరా సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’ , బలగంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని వారి స్టైల్‌కు ప్రత్యేకమైన మార్క్ సెట్ చేశాయి.
