
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు. 1995లో విడుదలైన అమ్మదొంగ సినిమాతో ఆయన టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఆ సినిమా దర్శకుడు సాగర్ వద్ద అసిస్టెంట్ గా చేరారు. 2004లో యజ్ఞం సినిమాతో గోపీచంద్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేశారు. అప్పటివరకు విలన్ పాత్రల్లో నటించిన గోపీచంద్ కు హీరోగా ఈ మూవీ బ్రేక్ ఇచ్చింది. దర్శకుడిగా రవికుమార్ చౌదరికీ ఇదే తొలి చిత్రం. రెండో ప్రయత్నంలోనే నందమూరి బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. వీరభద్ర సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత నితిన్ తో ఆటాడిస్తా సినిమా తీశారు. ఆ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది యావరేజ్ గా నిలిచింది. దాని తర్వాత మళ్లీ- గోపీచంద్ తో సౌఖ్యం సినిమా తీశారు. అది ఫ్లాప్ కావడంతో ఇక దాదాపుగా చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. చివరిగా 2024లో తిరగబడర సామి సినిమాకు కథను అందించారు.
