పుష్ప సినిమా మొదటి భాగం విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తిచేసి ఆగస్టు 15కు విడుదల చేస్తున్నట్లు ఏడాది క్రితమే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏపీలో ఎన్నికలు రావడం, పవన్ కల్యాణ్ విషయంలో అల్లు అర్జున్ వ్యవహార శైలిలాంటివన్నీ కలిపి పెద్ద వివాదాన్ని సృష్టించాయి. దీంతో ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే కష్టమవుతుందనే ఉద్దేశంతో నిర్మాతలు డిసెంబరు 6కు వాయిదా వేశారు. ఈ వాయిదా ఎప్పుడైతే పడిందో అప్పటినుంచి చిత్ర యూనిట్ సభ్యుల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగాయి.
సినిమాను ఒకేసారి మూడు యూనిట్లు ఏర్పాటు చేసి షూటింగ్ ను త్వరగా పూర్తిచేయాలని అల్లు అర్జున్ దర్శకుణ్ని కోరారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. సన్నివేశాలు బాగా రావాలంటే ప్రతి విషయంలో తన జోక్యం ఉండాలని చెప్పేశారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. సుకుమార్ అమెరికా నుంచి తిరిగివచ్చి రెండు వారాలవుతున్నప్పటికీ షూటింగ్ మొదలుపెట్టలేదు. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ టూర్ కు వెళ్లారు. షూటింగ్ కోసం నిర్మాతలు రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన సెట్ కు మూడు నెలల నుంచి అద్దె చెల్లిస్తున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలను తిరిగి తీయడంవల్ల నటుల కాల్షీట్లకు డబ్బులు చెల్లించడంతోపాటు షూటింగ్ ఖర్చు విపరీతంగా అవుతోంది.
దీంతో నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ తాము ఎంతైతే బడ్జెట్ కేటాయించామో అంతే బడ్జెట్ లో పూర్తిచేయాలని, అంతకుమించి రూపాయి ఖర్చుపెట్టేది లేదని దర్శకుడికి తెగేసి చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు తీవ్రమవడంతో నిర్మాతలు మండిపడుతున్నారు. అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తిచేయాల్సిందేనని హీరోకు, దర్శకుడికి ఖరాఖండిగా చెప్పేశారు. వారిద్దరూ విభేదాలు పరిష్కరించుకునేంతవరకు షూటింగ్ జరిపే ప్రసక్తే లేదన్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు దాదాపు రూ.400 కోట్లు ఖర్చుచేశారు. ప్రస్తుతం హీరోకు ఉన్న మార్కెట్ ప్రకారం ఇంతకుమించి ఖర్చుపెడితే నష్టపోవడం తథ్యమనే అంచనాలో మైత్రీ మూవీస్ ఉంది. అందువల్ల షూటింగ్ ఇపట్లో మళ్లీ మొదలయ్యేలా లేదు. అందుకే
ఈ ఏడాది ఆఖరికి సినిమా విడుదలని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.