ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మారుతి ‘రాజాసాబ్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. గత రెండు సంవత్సరాలుగా స్పిరిట్ సినిమా గురించిన ప్రచారం జరుగుతోంది. సినిమా ప్రకటించి చాలా కాలం అయినా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం చివరి దశ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్శకుడు సందీప్ వంగ ప్రకటించారు. ఏడాది కాలంలో సినిమా షూటింగ్ ముగించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2026లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్పిరిట్ సినిమాలోనూ ప్రభాస్ కి ఏమాత్రం తగ్గకుండా విలన్ రోల్‌ను డిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ సైఫ్ అలీ ఖాన్ వంటి వారిని స్పిరిట్ సినిమాలో విలన్ గా నటింపజేస్తే కచ్చితంగా మంచి ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. దేవర సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన సైఫ్ అలీ ఖాన్ కి స్పిరిట్ లో విలన్ రోల్ దక్కేనా అనేది తెలియాలంటే మరి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.
ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో ‘రాజాసాబ్’ సినిమాను చేస్తున్నారు. మరో వైపు సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు రెండు వచ్చే ఏడాదిలో విడుదల అవ్వనున్నట్లుగా ప్రభాస్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరో వైపు సలార్ 2 సైతం షూటింగ్ ప్రారంభం అయింది. స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తే ప్రభాస్ మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.