రూపుదిద్దుకొంటున్న ‘జాంబీ రెడ్డి 2’


టాలీవుడ్‌లో కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఎదిగిన యంగ్ హీరో తేజా సజ్జా 2021లో హిట్ సాధించిన ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి 2’ తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈసారి కథను అందిస్తూ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

హనుమాన్, మిరాయ్ చిత్రాలతో తన రేంజ్ మరింత పెంచుకున్న తేజ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తన కెరీర్‌కు తొలి గుర్తింపు తీసుకొచ్చిన జోనర్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్నాడు.

2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ తేజా సజ్జకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో పూర్తి స్థాయి జాంబీ జోనర్‌లో వచ్చిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, కామెడీ, థ్రిల్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదల సమయంలో యూత్‌తో పాటు మాస్ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ అందుకుని, తక్కువ బడ్జెట్‌తో మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా జాంబీల మేకప్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రశాంత్ వర్మ ట్రీట్‌మెంట్ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి 2’ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ప్రీ-ప్రొడక్షన్ వేగంగా జరుగుతోందని సమాచారం.

మొదటి భాగాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈసారి దర్శకత్వం వహించకపోయినా, కథను అందిస్తూ ప్రాజెక్ట్‌కు క్రియేటివ్ సపోర్ట్ అందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రెండో భాగాన్ని ఒక సర్ప్రైజింగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నారని, ఆ పేరు బయటపడితే పెద్ద సెన్సేషన్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈసారి విజువల్ ఎఫెక్ట్స్, జాంబీ మేకప్, యాక్షన్ బ్లాక్స్ విషయంలో టీమ్ ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వస్తున్నారు.

Scroll to Top