
‘జన నాయగన్’ విడుదలకు తొలగుతున్న అడ్డంకులు
*****************************
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం జన నాయగన్ ఎట్టకేలకు ఫిబ్రవరి 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రాజకీయ నేపథ్య చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా, పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో విజయ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, విజయ్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని భావిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు.
అయితే చిత్రంలోని కొన్ని రాజకీయ, సామాజిక అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే కొత్త వెర్షన్‌ను సెన్సార్ బోర్డుకు సమర్పించినట్లు, కోర్టులో ఉన్న కేసులు ఉపసంహరించుకునే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ వివాదాన్ని మరింత లాగితే తమకే నష్టమని భావించిన నిర్మాతలు సెన్సార్ బోర్డు సూచించిన కండిషన్లకు ఓకే చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల ఫుటేజ్ తొలగించడం, కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేయడం వంటి మార్పులతో సినిమాను మరోసారి సెన్సార్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాంటి కొత్త అభ్యంతరాలు లేకుండా క్లియరెన్స్ లభిస్తే, ఫిబ్రవరి 20న ‘జన నాయగన్’ థియేటర్లలోకి రావడం ఖాయమనే ఆశతో విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
