ఆగస్టు 22న ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి 2025 బరిలో దిగుతుందని అనుకున్న ఈ సినిమా, ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ ట్రీట్‌గా రానుందని తెలుస్తోంది. 2025 ఆగస్టు 22న ‘విశ్వంభర’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, అంచనాలు అయితే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ‘విశ్వంభర’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. షూటింగ్ ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మేకర్స్ అన్ని అడ్డంకులను అధిగమించి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. వీలైనంత త్వరగా ‘విశ్వంభర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా విడుదల ఉండటంతో పోటీ లేకుండా తప్పుకున్నారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజును పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న ‘విశ్వంభర’ థియేటర్లలో సందడి చేయనుంది. ఒకవైపు ‘విశ్వంభర’ పనులు జరుగుతుండగానే, మరోవైపు చిరంజీవి తన తదుపరి సినిమా కోసం కూడా రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే ‘మెగా 157′ కోసం ఏకంగా 90 రోజుల కాల్షీట్స్ కేటాయించారట. అంటే ఈ సినిమా కూడా శరవేగంగా పూర్తి కానుందని సమాచారం. విశ్వంభర’ చిత్రానికి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కునాల్ కపూర్, అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Scroll to Top