త్వరలో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’

త్వరలో రానున్న ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’
*తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల

హాలీవుడ్‌ ప్రొడక్షన్ కంపెనీ డిస్నీ ప్రతిష్ఠాత్మక నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ కూడా ఒకటి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా రిలీజైంది. కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌, ఆరోన్‌ స్టోన్‌ వంటి నటీనటులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఇక ట్రైలర్‌లో ‘ముఫాసా’ పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్‌ చెప్పడం అందరినీ ఆకర్షిస్తుంది. అద్భుతమైన విజువల్స్‌కి మహేష్ డైలాగ్స్‌ తోడవ్వడంతో ట్రైలర్‌ అద్భుతంగా అనిపించింది.

“అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి” అంటూ మహేష్ చెప్పిన డైలాగులు ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి. ఇక ముఫాసాకి వాయిస్‌ ఓవర్‌ అందించడంపై మహేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. “మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రలో కొత్త కోణం చూడబోతున్నాం. తెలుగులో ‘ముఫాసా’కి వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ అవ్వడంతో ఇది నాకు ఇంకా స్పెషల్‌గా ఉంది.” అంటూ మహేష్ బాబు చెప్పారు.

మహేష్ బాబు వాయిస్ అందించడంతో తెలుగు ట్రైలర్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలో కూడా ముఫాసా: ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ హ్యాష్ ట్యాగ్ దూసుకుపోతుంది. మహేష్ ఫ్యాన్స్ అయితే సినిమా పక్కాగా చూస్తామంటూ పోస్టులు పెడుతున్నారు. మహేష్ వాయిస్‌తో సినిమా ట్రైలర్‌కే అందం వచ్చిందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమా హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకి షారుక్‌ ఖాన్‌ వాయిస్ ఇవ్వడం మరో విశేషం. అలానే ముఫాసా చిన్నప్పటి పాత్రకి షారుక్ తనయుడు అబ్రం వాయిస్‌ ఓవర్ ఇచ్చాడు.

“ముఫాసాకి అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది.2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్‌ చేయడం ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఇంకా ఆనందం.” అంటూ షారుక్‌ తెలిపారు. ఇక ఇందులోని సింబా పాత్రకి షారుక్‌ పెద్దకొడుకు ఆర్యన్‌ ఖాన్‌ డబ్బింగ్ ఇచ్చాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది.

Scroll to Top