
ఛాంపియన్ సినిమాతో మళ్ళీ తెరమీదకి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి
************************************
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఛాంపియన్. మలయాళ బ్యూటీ అనస్వరా రాజన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి “రాజిరెడ్డి” అనే పాత్రలో కనిపించనున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరిగా నిలిచిన హీరో కళ్యాణ్ చక్రవర్తి. నందమూరి వంశం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి 1980-90వ దశకాల్లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లెజెండ్, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ సోదరుడు, నిర్మాత త్రివిక్రమరావు కుమారుడే కళ్యాణ్ చక్రవర్తి. కేవలం హీరోగానే కాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు. కాగా 1989లో చిరంజీవి హీరోగా నటించిన ‘లంకేశ్వరుడు’ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. అయితే ఉన్నట్టుండి సినిమాలు దూరమయ్యారు ఈ నటుడు. తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆయనను చూసుకునేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కానీ మళ్లీ ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం హాట్ టాపిక్ గా మారింది. మూవీ యూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది.
