నేటి తరం హీరోలలో అగ్రభాగం సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారి వారసులే కనిపిస్తారు. అందుకు తెలుగు సినీ పరిశ్రమ మినహాయింపేమీ కాదు. ఇక్కడ కూడా హీరో, హీరోయిన్ల వారసులలతోపాటు దర్శకులు, నిర్మాతల వారసులు కూడా వెండి తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అలా వచ్చిన వారిలో కొందరు నిలుదొక్కుకుంటే.. మరికొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరో సీనియర్ దర్శకుడి కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్నో యూత్ ఫుల్ సినిమాల దర్శకుడు తేజ తన కొడుకును హీరోగా వెండి తెరకు పరిచయం చేయబోతున్నారు.
కొత్త హీరోలకు గాడ్ ఫాదర్ లాంటి దర్శకుడు తేజ తన కొడుకు అమితోవ్ తేజను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సెరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ నవంబర్ లేదా డిసెంబర్ నుండి షూట్‌కు వెళ్లొచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు తేజ చివరిగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో హిట్ కొట్టారు. ఆ నమ్మకంతో దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా సక్సెస్ కాలేదు.
తాజాగా తన కుమారుడు అమితోవ్ తేజపై ఫోకస్ పెట్టారట తేజ. తన కొడుకు విషయంలో.. నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని శిక్షణలూ పూర్తి చేసకున్న తర్వాత హీరోగా కెరీర్ మొదలుపెట్టేందుకు తేజా అంగీకరించారని టాక్ నడుస్తోంది. అయితే, కొడుకు సినిమా నిర్మాత ఎవరు? అది తేజా దర్శకత్వంలోనే తీసున్నారా? లేక మరెవరైనా సీనియర్ డైరెక్టర్ తీస్తున్నారా? అనేది మాత్రం కొన్నాళ్ళు సస్పెన్స్.