మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విభిన్నమైన జోనర్లలో సినిమాలు వస్తున్నాయి. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇంకాస్త ఎక్కువగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే ‘కోటబొమ్మాళి పీఎస్’. సందేశాత్మక కథతో.. మిస్టరీతో జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ స్టోరీతో రూపొందిన ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది.
కథ:
రవి (రాహుల్ విజయ్) పోలీసుద్యోగంలో చేరతాడు. అదే స్టేషన్లో కుమారి (శివానీ రాజశేఖర్) కానిస్టేబుల్ గా పని చేస్తూంటుంది. రామకృష్ణ (శ్రీకాంత్) ఏఎస్సైగా వుంటాడు. కుమారి, రామకృష్ణలు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. రామకృష్ణ కూతురికి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఆమె అందులో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వుంటాడు. ఒక రోజు కుమారి బంధువు, ఆమె సామాజిక వర్గ పార్టీ కార్యకర్త మున్నా (పవన్ తేజ్) అనే అతను, పోలీస్ స్టేషన్లో బీభత్సం సృష్టిస్తాడు. ఏఎస్సై రామకృష్ణ లాకప్ లోవేస్తే ఫోన్లు చేయించుకుని విడుదలై పోతాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఇంకో రోజు రామకృష్ణ, రవి ఓ పెళ్ళికి హాజరై బాగా తాగుతారు. జీపు డ్రైవ్ చేయడానికి రామకృష్ణ మేనల్లుడ్ని తెచ్చుకుంటాడు. అదే జీపులో కుమారి ఎక్కుతుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. జీపు డ్రైవ్ చేసిన రామకృష్ణ మేనల్లుడు పారిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో పార్టీ కార్యకర్త చనిపోతాడు. దీంతో ఆ పార్టీలో ఆందోళన చెలరేగుతుంది. ఏపీ లోని ఆ నియోజక వర్గం టెక్కలిలో ఉప ఎన్నిక వుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 50 వేలు వున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ చేసిన సిబ్బందిని అరెస్ట్ చేయమని హోమ్ మంత్రి జయరామ్ (మురళీ శర్మ) ని రంగంలోకి దించుతుంది అధికార పార్టీ ప్రభుత్వం. దీంతో రామకృష్ణ, రవి, కుమారి ముగ్గురూ పరార్ అవుతారు. మరోవైపు ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం నిందితుల్ని 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి జయరాం శపథం చేస్తాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) కి ఆ బాధ్యత అప్పగిస్తాడు డిజిపి. వేట మొదలవుతుంది. దొరక్కుండా ప్రదేశాలు మారుస్తూ పరారీలో వుంటారు ముగ్గురూ. ఇలా ఎక్కడిదాకా, ఎంతకాలం పరుగుదీశారు? రజియా అలీ టీం వాళ్ళని పట్టుకోగలిగిందా? మధ్యలో తలెత్తిన వూహించని పరిణామమేమిటి? చేయని నేరానికి నేరస్థులుగా ముద్రపడిన పోలీసులు ముగ్గురూ, ముఖ్యమంత్రి ఓట్ల రాజకీయానికెలా బలయ్యారు? … ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఇది 2011 లో కేరళలో జరిగిన ఉదంతం. నలుగురు పోలీసులు ఒక టాక్సీలో పెళ్ళికి వెళ్ళి వస్తూంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆగ్రహం పెల్లుబికింది. ఆ నలుగురు పోలీసుల మీద ఎస్సీ/ఎస్టీ చట్టం కింద, హత్య కేసు కింద అరెస్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నలుగురూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి బెయిల్ కోసం ప్రయత్నించారు. 100 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఇప్పుడు పన్నెండేళ్ళు గడిచిపోయినా కేసు ఇంకా తేలలేదనేది వేరే సంగతి. ఈ ఉదంతాన్ని సినిమాకి అనుకూలంగా మార్చి 2021 లో మలయాళంలో ‘నాయాట్టు’ (వేట) తీశాడు దర్శకుడు మార్టిన్ ప్రకట్. దీన్ని తెలుగులో ‘కోట బొమ్మాళి పిఎస్’ గా రీమేక్ చేశారు. ‘నాయాట్టు’ చూస్తే అది కథ కాదు. జీవితంలో కథలుండవు, గాథలే వుంటాయి. గాథల్ని సినిమాలుగా తీస్తే ఆడవు గనుక కథగా మార్చి తీస్తారు.
ఐతే గాథలా వున్న నిజ సంఘటనని అనుకోకుండా గాథగానే తీసి విజయం సాధించారు ‘నాయాట్టు’ తో. ఇదో ప్రత్యేకత.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నయట్టు’ మూవీకి ‘కోటబొమ్మాళి పీఎస్’ రీమేకే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా కథను సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచారు. ‘న్యాయంపై ఎప్పుడూ రాజకీయం గెలవలేదు’ అనే సందేశాన్ని పెయిన్ ఫుల్‌గా చూపించాడు దర్శకుడు. వ్యవస్థలో ఉన్న లోపాలను చూపించారే తప్పితే.. ఎక్కడా గీత దాటలేదు. సోషల్ మెసేజ్ అనేసరికి అనర్గళమైన ప్రసంగాల జోలికి పోకుండా.. ఎమోషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓ వైపు సిస్టమ్‌లో ఉన్న లోపాల్ని చూపిస్తూనే.. మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇళ్లలో జరిగే పరిణామాలను.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని ఇందులో చక్కగా చూపించారు. దర్శకుడు తేజ మార్నికి కోట బొమ్మాళి ప్రాంతంపై మంచి పట్టు ఉండటంతో.. రియల్ లొకేషన్స్‌లో సహజత్వాన్ని చూపించారు. ఫస్టాఫ్ రేసీగా సాగిపోతుంది. మధ్యలో కాస్త స్పీడ్ తగ్గినా.. నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్‌ని క్లైమాక్స్ వరకూ మెయిన్‌టైన్ చేశాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది.
ఎక్కడా బోర్ కొట్టకుండా పాత్రల పరిచయంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ.. కథ, కథనం చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. టెక్కలి ఉపఎన్నిక.. యువకుడి మరణం.. అందులో రామకృష్ణ, రవి, కుమారి ఇరుక్కోవడం.. పోలీసుల నుంచి తప్పించుకోవడంతో కథ వేగం పుంజుకుంటుంది. అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) ఎంట్రీ తరువాత నుంచి రామకృష్ణ (శ్రీకాంత్) మైండ్ గేమ్ మొదలౌతుంది. ఇద్దరు తెలివైన పోలీసుల మధ్య ఎత్తుకి పైఎత్తులు ప్రేక్షకులకు థ్రిల్‌ని కలిగిస్తాయి. ఒరిజినల్లో ఇంకే మార్పులు చేయకుండా, తెలుగు మూస మసాలాలు వాడకుండా, ముగింపు కాస్త మార్చి, ఉన్నది వున్నట్టు రియలిస్టిక్ జానర్లో తీశారు. దీంతో మూస సినిమాలకి భిన్నంగా ఇది కనిపిస్తుంది. నేటి తెలుగు సినిమాల్ని మూస ఫార్ములాలు కాకుండా ఇలా రియలిస్టిక్ గా తీసినా ఆడతాయని ‘కోట బొమ్మాళి పిఎస్’ రీమేక్ ద్వారా గుర్తిస్తే మంచిదే.
నటన– సాంకేతికాలు
మలయాళంలో జోజు జార్జి పాత్రని శ్రీకాంత్ పోషించాడు. అయితే ఈ ఏఎస్సై పాత్రకి గతంలో గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ స్పెషలిస్టుగా పని చేశాడని అదనపు హంగు ఇచ్చారు. శ్రీకాంత్ రాజకీయాలకి బలైన ఈ పోలీసు పాత్రని సహజత్వంతో నటించాడు. తనని వేటాడే పోలీసులతో హైడ్రామా, తన వాళ్ళతో ఫ్యామిలీ డ్రామా దృశ్యాలకి బలాన్నిచ్చాడు. శ్రీకాంత్ కి ఎదుటి పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్ ఎస్పీ పాత్ర. ఎత్తుకి పైయెత్తులు ఈ ఇద్దరి మధ్యే వుంటాయి. ఈ కరుడుగట్టిన పోలీసు పాత్రని పవర్ఫుల్ గా పోషించింది. కానిస్టేబుల్ గా శివానీ, ఇంకో కానిస్టేబుల్ గా రాహుల్ విజయ్ లు బాధిత పాత్రల్ని తగు భావోద్వేగాలతో నటించారు. ఈ చదరంగపు ఆట ఆడే హోమ్ మంత్రిగా మురళీ శర్మ తన మార్కు నటనతో ఓకే.
కథ జరిగే శ్రీకాకుళం లొకేషన్స్, ఆంధ్రా- ఒరిస్సా బోర్డర్ దృశ్యాల్ని కెమెరామాన్ జగదీష్ ఒరిజినల్ మూవీకి తీసి పోనివిధంగా దృశ్యీకరించాడు. రియలిస్టిక్ జానర్ టోన్ లో, లైటింగ్ తో దృశ్యాల్ని క్యాప్చర్ చేశాడు. అలాగే రంజిన్ రాజ్ సంగీతంలో ఒక హిట్టయిన పాట, నేపథ్య సంగీతం బలంగా వున్నాయి. ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం అన్నీ మంచి క్వాలిటీతో వున్నాయి. ఈ రీమేక్ తో దర్శకుడు తేజ మార్ని సక్సెసయ్యాడు. పోలీసు వ్యవస్థని వాడుకునే రాజకీయ వ్యవస్థ, అందులో బలయ్యే పోలీసులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటర్ల పాత్ర- ఈ అంశాల్ని స్పృశిస్తూ చివర ఓ సందేశంతో మలయాళ ఒరిజినల్ని అనుసరించి మేకింగ్ చేశాడు.
చిత్రం: కోటబొమ్మాళి పిఎస్
రచన – దర్శకత్వం: తేజ మార్ని
తారాగణం:
శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, మురళీ శర్మ, పవన్ తేజ్, బెనర్జీ తదితరులు
సంగీతం: రంజిన్ రాజ్,
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
సహ నిర్మాతలు: భాను కిరణ్ ప్రతాప, రియాజ్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి