సహజనటుడు చంద్రమోహన్ – * మే 23 చంద్రమోహన్ జయంతి
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు ఎప్పుడు చిరస్థాయిగా నిలుస్తుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు చంద్రమోహన్. హీరోగా రాణించిన ఆయన ఆ తర్వాత సహాయక పాత్రల్లోనూ నటించి మెప్పించారు. మే 23 ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జీవన విశేషాలు కొన్ని….
చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించారు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు
చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఈయన వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తి చేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు . సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. ‘రంగులరాట్నం’ (1966) చిత్రంతో హీరోగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత ఆయన చేసిన ‘సుఖదుఖాలు’, ‘బాంధవ్యాలు’ చంద్రమోహన్‌కు చాలా పేరు తెచ్చిపెట్టాయి. 1978లో రిలీజైన ‘పదహారేళ్ల వయసు’ చిత్రం అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
హీరోగానే కాదు.. సహ నటుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించారు. చనిపోయే ముందు వరకూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటులలో చంద్రమోహన్ ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ‘రంగుల రాట్నం’లో చూసిన మహానటులు ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు.. ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడు అని మహానటుడు ఎన్టీఆర్ ప్రశంసించిన సందర్భాలున్నాయి. అంతేకాదు తన ‘బాంధవ్యాలు’ సినిమాలో దాదాపు హీరో పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. 1980వ దశకంలో చిరంజీవి లాంటి హీరోలు వచ్చేసిన తర్వాత కూడా చంద్రమోహన్ హీరోగా చేస్తూనే వచ్చారు. విశ్వనాథ్, బాపు లాంటి కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చిన దర్శకులకు చంద్రమోహన్ ఒక వరంగా కనిపించేవారు. దర్శకుడు విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో చంద్రమోహన్‌కు బంధుత్వం ఉంది. విశ్వనాథ్ తీసిన అనేక చిత్రాల్లో చంద్రమోహన్ కీలక పాత్ర పోషించడం వెనుక ఉన్న విషయం అదే. దర్శకుడి అంతరంగాన్ని ఎరిగి నటించే నటుడని ఇండస్ట్రీ పెద్దలు చెబుతుంటారు. ఒక రకంగా తమిళ సినిమా రంగంలో కమల్ హసన్ ఏ తరహా మార్పుకు నాంది పలికారో.. తెలుగు పరిశ్రమలో చంద్రమోహన్ కూడా అలాంటి పాత్రనే నిర్వహించారని అలనాటి నటీనటులు చెబుతుంటారు. నట దర్శకురాలు విజయనిర్మల దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ చంద్రమోహన్ కీలక పాత్రలు చేశారు.

కొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు. చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్ (సినిమా)లో నటించారు. చంద్రమోహన్ నటించిన 900 పైచిలుకు సినిమాల్లో 175పైగా సినిమాల్లో హీరోగా నటించారు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. కానీ చంద్రమోహన్ మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. చంద్రమోహన్‌కు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ చూడటానికి చక్కగా అందంగా ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టులుగా పిల్లలను పరిచయం చేద్దామని ఆయన భార్య అడిగినప్పటికీ వద్దని సున్నితంగా తిరస్కరించినట్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ఆయన భార్య జలంధర, రచయిత్రి. కొన్ని కథా సంకలనాలను వెలువరించారు. చంద్రమోహన్ 2023 నవంబర్ 11న 81 సంవత్సరాల వయసులో కాలధర్మం చెందారు.
పురస్కారాలు
1978 – పదహారేళ్ల వయసు సినిమా కోసం ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం పొందారు.
2005 – అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు.
2021 – తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు – మొట్టమొదటి సరిగా 14 దేశాల నుండి రచయుతలు 108 చంద్ర మోహన్ నటించిన చిత్రా విశ్లేషణ.
