
తెలుగు సినీరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 14, 2026) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
ప్రకాశం జిల్లా రావినూతలలో 1946 జూన్ 8న జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఇతని తల్లి దండ్రులు నాగయ్య. శ్రీదేవి. విద్యార్థి దశ నుంచే నాటకాలపై మక్కువ పెంచుకున్న గిరిబాబు నటుడిగా ఎదగాలనే బలమైన కోరికతో మద్రాసు పట్టణానికి చేరుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి ఒకే గదిలో ఉంటూ, అవకాశాల కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు గిరిబాబు 1973లో విడుదలైన జగమే మాయ చిత్రం ద్వారా నటుడిగా తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు. ప్రారంభంలో ప్రతినాయక పాత్రలతో పాటు సహాయ పాత్రల్లో నటించారు. ఆయన ప్రత్యేకమైన సంభాషణల ఉచ్చారణ, శరీర భాష, గంభీరమైన స్వరం ప్రతినాయక పాత్రలకు అనుకూలంగా ఉండేవి. ఈ లక్షణాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
1970వ దశకం మధ్యలో ‘జ్యోతి, నేరం నాది కాదు ఆకలిది, మహాకవి క్షేత్రయ్య, ప్రేమలేఖలు, కల్పన’ వంటి చిత్రాల్లో నటించారు. 1977లో విడుదలైన కురుక్షేత్రం చిత్రంలో దుశ్శాసనుడి పాత్ర పోషించారు. అదే సంవత్సరంలో ‘దేవతలారా దీవించండి’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ చిత్రం ఆయన నిర్మాణ రంగంలో తొలి ప్రయత్నాల్లో ఒకటి. 1970వ దశకం చివరి నుంచి 1980వ దశకం వరకు గిరిబాబు పలు తెలుగు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ‘ఇంద్రధనుస్సు, దొంగల దోపిడి, మల్లెపూవు, కరుణామయుడు, నా ఇల్లు నా వాళ్ళు, కోతల రాయుడు’ వంటి చిత్రాల్లో నటించారు. 1990వ దశకంలో గిరిబాబు విలన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా హాస్య పాత్రలు, కుటుంబ పెద్ద పాత్రలు, ఇతర సహాయ పాత్రల్లోనూ నటించారు. ‘ప్రేమ యుద్ధం, అన్న-తమ్ముడు, చిత్రం భళారే విచిత్రం, గోల్మాల్ గోవిందం, 420, భైరవ ద్వీపం, హలో బ్రదర్, అల్లుడా మజాకా, ఆలీబాబా అరడజను దొంగలు, సిసింద్రీ, లిటిల్ సోల్జర్స్, నిన్నే పెళ్ళాడతా’ వంటి చిత్రాల్లో నటించారు.
ఈ దశకంలో ఆయన హాస్య పాత్రలు, ప్రతినాయక పాత్రలు, కుటుంబ సంబంధిత పాత్రలు పోషిస్తూ వివిధ తరాల నటులతో కలిసి పనిచేశారు.
నటుడిగా కొనసాగుతూనే దర్శకత్వం, చిత్ర నిర్మాణంపై ఆసక్తి చూపించారు. 1978లో సింహగర్జన చిత్రానికి దర్శకత్వం వహించారు. 1990లో ఇంద్రజిత్ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1980వ దశకంలో కాళి, ఎర్ర మల్లెలు, నా దేశం, ముందడుగు, అడవి సింహాలు, రుద్రకాళి, మహానగరంలో మాయగాడు, ఇంటి గుట్టు, మెరుపు దాడి, కంచు కాగడా, విజేత, ఏడడుగుల బంధం, పసివాడి ప్రాణం వంటి చిత్రాల్లో నటించారు. 1985లో ‘రణరంగం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ కాలంలో ప్రతినాయక పాత్రలతో పాటు కథలో ప్రాధాన్యం ఉన్న సహాయ పాత్రల్లోనూ నటించారు.
2000వ దశకం ప్రారంభం నుంచి గిరిబాబు ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో కనిపించారు. ఫ్యామిలీ సర్కస్, నువ్వే కావాలి, రా, విష్ణు, గోల్మాల్, సంబరం, నిన్నే ఇష్టపడ్డాను, మిస్టర్ & మిసెస్ శైలజ కృష్ణమూర్తి, అతడు, ఒక్కడున్నాడు, కితకితలు, కృష్ణ, మేస్త్రి వంటి చిత్రాల్లో నటించారు. ఈ కాలంలో ఆయన హాస్యభరితమైన పాత్రలతో పాటు కుటుంబ పెద్దగా, రాజకీయ నాయకుడిగా, ఇతర ముఖ్యమైన సహాయ పాత్రల్లో కనిపించారు. 2008లో నీ సుఖమే నే కోరుతున్నా చిత్రానికి దర్శకత్వం వహించారు.
2010వ దశకం నుంచి గిరిబాబు వివిధ తరాల కథానాయకులు నటించిన చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. డమరుకం, ప్రతినిధి, చండీ, టాప్ ర్యాంకర్స్, గీత గోవిందం, మేరా భారత్ మహాన్ వంటి చిత్రాల్లో నటించారు.
తరువాతి కాలంలో డిస్కో రాజా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వంటి చిత్రాల్లోనూ కనిపించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో ఆయన 600కు పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడు, కథానాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు వంటి విభిన్న పాత్రలు పోషించారు. నటనతో పాటు కథా రచన, చిత్ర నిర్మాణం, దర్శకత్వ రంగాల్లోనూ పనిచేశారు.
ఇలా కెరీర్ తొలినాళ్లలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించిన గిరిబాబు ఆ తర్వాత విలన్ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు. కాలక్రమేణా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా మారి ఏకంగా 600లకు పైగా సినిమాల్లో అలరించారు. ‘కురుక్షేత్రం’, ‘కరుణామయుడు’, ‘కాళి’, ‘బంగారు కుటుంబం’, ‘సిసింద్రి’ వంటి పాత తరం చిత్రాలతో పాటు, ఈ తరం ప్రేక్షకులకు సైతం ఆయన సుపరిచితులే. ‘అతడు’ సినిమాలో త్రిష తండ్రిగా, ‘గీత గోవిందం’ చిత్రంలో రష్మిక తాతయ్యగా, ‘జాతి రత్నాలు’ సినిమాలో ముఖ్యమంత్రిగా, ‘అఆ’ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల తాతయ్యగా ఆయన పండించిన హాస్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ ఆయన వెండితెరపై కనిపించిన చివరి చిత్రం.
గిరిబాబు కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, కథారచయితగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ‘దేవతలారా దీవించండి’, ‘సింహ గర్జన’, ‘మెరుపు దాడి’, ‘ఇంద్రజిత్’ వంటి చిత్రాలను నిర్మించడమే కాకుండా, ‘మెరుపు దాడి’ సినిమాకు కథను కూడా అందించారు. అలాగే ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుతున్నా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు రఘుబాబు, బోసుబాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రఘుబాబు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్గా రాణిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిన గిరిబాబు భౌతికంగా దూరమైనప్పటికీ, ఆయన పోషించిన విభిన్నమైన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
