సుమధుర స్వరకర్త ఆదినారాయణరావు

సుమధుర స్వరకర్త ఆదినారాయణరావు – *ప్రముఖ సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు జయంతి ఆగష్టు 21
——————————– ——————————– ————————
తెలుగు సినిమాకు సస్వరాల సంగీత దర్శకుడుగా, నిర్మాతగా గుర్తింపు పొందిన విశిష్ట కళాకారుడు పి.ఆదినారాయణరావు. ఈయన ప్రముఖ నటి అంజలీదేవికి భర్త కూడా. ఈనెల 21 పి.ఆదినారాయణరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి చిరుపరిచయం…

పి.ఆదినారాయణరావు పూర్తిపేరు పెనుపాత్రుని ఆదినారాయణరావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నిర్మాత. ఇతడు భార్య, నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత గుర్తింపు పొందారు. ఆదినారాయణరావు ఆగష్టు 21, 1914 సంవత్సరంలో విజయవాడలో కృష్ణాష్టమి రోజున జన్మించారు. వీరి తండ్రి కృష్ణయ్య గౌడ్ ,తల్లి అనసూయ .

చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి ‘సావిత్రి’ నాటకంలో నారదుని పాత్ర పోషించారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ‘పెదగురువు’గారు పట్రాయని నరసింహశాస్త్రి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు.

ఆ తర్వాత సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో బి.ఎ.సుబ్బారావు నిర్మించిన పల్లెటూరి పిల్ల చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి అంజలీదేవి పేరుతో 1953లో అంజలీ పిక్చర్స్ స్థాపించారు. 1955లో నిర్మించిన అనార్కలి చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని ‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’ అనే మధుర గీతం ఈయన సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తర్వాత 1957లో రూపొందించిన సువర్ణసుందరి తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రస కలశం. సతీ సక్కుబాయి వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి. ప్రఖ్యాత తెలుగు సంగీత దర్శకులు సత్యం, టి.వి. రాజులతో పాటు హిందీ సంగీత దర్శకులు లక్ష్మీ కాంత్ – ప్యారేలాల్ కూడా ఒకప్పుడు వీరి దగ్గర సహాయ సంగీత దర్శకులుగా పనిచేసిన వారు కావడం విశెషం. ఈయన 1991 సంవత్సరం జనవరి 25 న పరమపదించారు.

Scroll to Top