
సెన్సుబిలిటీ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రతి సినిమా విలక్షణమైనదే.. ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలు, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిత్రాలతో యువతను ఆకుట్టుకుని.. లీడర్ లాంటి సినిమాతో అందరినీ ఆలోచింపజేసినా.. ఫిదా, లవ్‌స్టోరీ లాంటి సినిమాలతో ప్రేమరాగాలు పలికించినా.. ఏం చేసినా అది శేఖర్ కమ్ములకే దక్కింది. అలాంటి డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ధనుష్ లాంటి యాక్టర్, నాగార్జున లాంటి స్టార్, రష్మిక లాంటి హీరోయిన్ తో తీసిన సినిమా “కుబేర”
కథ ఏమిటంటే..?
ఎన్నో ఏళ్లుగా సముద్రంలోపల ఉన్న ఆయిల్‌ని గుర్తించేందుకు ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. అయితే సరిగ్గా ఆయిల్ చిక్కిన తర్వాత ఆ విషయాన్ని ప్రభుత్వాని కంటే ముందు నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్) అనే బడా బిజినెస్‌మ్యాన్‌కి అధికారులు లీక్ చేస్తారు. దీంతో 15 ఏళ్లకి పైగా దేశానికి సరిపడే ఆయిల్ రిగ్ని తమ సొంతం చేసేందుకు పెట్రోలియం మినిస్టర్‌తో లక్ష కోట్లకి డీల్ కుదుర్చుకుంటాడు నీరజ్. వెంటనే ఈ విషయం తెలిసిన రిగ్‌లోని కార్మికుల్ని, అధికారులు అందరినీ చంపేసి ఫైర్ యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తాడు నీరజ్.
ఈ బడా డీల్‌ని ఎప్పటికీ ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు.. ఎలాంటి దర్యాప్తులు జరిగినా నిజం బయటకు రాకుండా ఉండేందుకు.. జైలులో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ తేజ్ (నాగార్జున)ని సాయం కోరతాడు నీరజ్. ఇందుకు ప్రతిగా జైలు నుంచి దీపక్‌ని విడుదల చేస్తానని హామీ ఇస్తాడు. అలా బయటికి వచ్చిన దీపక్ ఈ డీల్‌ని పూర్తి చేసేందుకు నీరజ్‌కి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని వెతికి పట్టుకుంటాడు. అందులో దేవా (ధనుష్) ఒకడు. వీళ్ల పేరు మీద బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి ఆ బ్లాక్ మనీని మొత్తం వైట్ చేసి.. వీళ్ల ద్వారానే మంత్రుల బినామీలకి డబ్బులు చెల్లించాలని దీపక్, నీరజ్ ప్లాన్ చేస్తారు.
అయితే అక్షరం ముక్క రాని దేవా.. వీళ్ల డీల్ గురించి ఎలా తెలుసుకుంటాడు? తెలిసిన తర్వాత దేవాని వీళ్లు వదిలేశారా? అసలు దేవా గతం ఏంటి..? దేవాకి.. సమీర (రష్మిక మందన) ఎందుకు సాయం చేస్తుంది.. మధ్యలో ఖుష్భూ ఎవరు? నిజాయతీపరుడైన దీపక్.. ఎందుకిలా తప్పులు చేస్తాడు?.. అసలు చివరికి ఏమవుతుంది అనేది తెరపై చూడాల్సిందే.
శేఖర్ కమ్ముల.. ఈ పేరే చాలు
కుబేర సినిమా ఎలా ఉందో చెప్పేముందు.. ఈ చిత్రం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో శేఖర్ కమ్ముల చెప్పిన మాటలు ఒకసారి గుర్తుచేయాలి. “బిచ్చగాడికి అయినా కోటీశ్వరుడికైనా అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది.. దేశానికి, దేవుడికి కూడా బిచ్చగాడు, కోటీశ్వరుడు అనే తేడా ఉండకూడదు.. సరస్వతీ దేవి తలవంచుకోకుండా ఉండేలా సినిమా తీయాలని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాను కానీ ఈ సారి మాత్రం సరస్వతి దేవి తల ఎత్తుకుని చూసే సినిమా తీశాను.. గర్వంతో కాదు నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నాను” అంటూ శేఖర్ కమ్ముల అన్నారు.
ముందు చెప్పిన ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి నిజాయితీతో చెబుతున్నా అన్నారు కదా.. నిజమే చెప్పడమే కాదు అంతే నిజాయితీగా ఈ సినిమాని ఆయన తీశారు. అసలు దేశ పౌరులందరికీ సంబంధించిన సహజవనరులు.. ఎందుకు ప్రైవేటీకరణ అవుతున్నాయి.. అసలు వాటి వెనుక నిజంగానే పెద్ద మాఫియా ఉందా? అనే ప్రశ్నలకి ఈ సినిమాలో కొన్ని సమాధానాలు ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు.
సగటు పౌరుడి ఆవేదన
డబ్బు, పవర్ మాత్రమే దేశాన్ని నడుపుతున్నాయి.. ఇక్కడ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వీటికి చోటే లేదు.. అంటూ సగటు పౌరుడిలోని ఓ ఆవేదనకి ఈ సినిమా అద్దం పడుతుంది. అలానే బిచ్చగాళ్లు కూడా మనుషులే సామీ.. వాళ్లని ఏదో అంటరానివాళ్లలా చూడక్కర్లేదు.. వాళ్ల వల్ల దేశానికి ఏం ఉపయోగం ఉంది అనే ప్రశ్నలు పక్కన పెట్టి ఎలాంటి నష్టం అయితే లేదనే విషయాన్ని గుర్తించాలి.. అన్న పాయింట్‌ని సూటిగా ప్రేక్షకుల గుండెలకి ఎక్కుపెట్టారు శేఖర్ కమ్ముల.
బిలియనీర్ అనే ముసుగులు వేసుకొని.. బిజినెస్మ్యన్ అంటూ కలరింగ్ ఇస్తూ దేశాన్ని అమ్ముకునే బడా కార్పొరేట్ జంతువుల్ని.. గుడి మెట్లపై అడుక్కునే ఓ బెగ్గర్.. వీలైతే సాయం చేయడమే కానీ హానీ చేయడం రాని ఒక సాదాసీదా బిచ్చగాడు.. ఎలా ఢీ కొట్టాడనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దాన్ని శేఖర్ కమ్ముల హ్యాండిల్ చేసిన విధానం అందర్ణి ఆకట్టుకుంటుంది. తాను నమ్మిన కథని ఎంత ఉన్నది ఉన్నట్లు చూపిస్తే జనాలకి అంత కనెక్ట్ అవుతుంది అన్న పాయింట్‌కి కట్టుబడి ఈ సినిమాని శేఖర్ కమ్ముల తీశారు. అందుకే ఎక్కడా హీరోయిజం, అనవసరమైన ఎలివేషన్స్, అక్కర్లేని బిల్డప్పులు ఏం లేవు. కథని ఎలా చెబితే హృదయాలకి హత్తుకుంటుందో అలానే చెప్పారు.
ధనుష్‌కి హ్యాట్సాఫ్.. నాగార్జున ప్లస్
ఇక ఇలాంటి చిత్రానికి ధనుష్ లాంటి స్టార్ హీరో ఓకే చెప్పడం చాలా గొప్ప విషయం. నిజానికి తెలుగు దర్శకుడైన శేఖర్ కమ్ముల.. మన హీరోలని కాదని కోలీవుడ్ హీరో దగ్గరికి ఎందుకు వెళ్లారా అనే ప్రశ్న సినిమా చూసేవరకూ అందరికీ ఎక్కడో ఒక చోట రావచ్చు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరికీ ఆ సందేహం కలగదు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ జీవించేశారు. కుక్కల పక్కన పడుకోవడం, చెత్తలో పడి దొర్లడం, ఎక్కడా ఎలాంటి బిల్డప్‌లు లేకుండా బిచ్చగాడు ఎలా ఉండాలో అలానే కనిపించడం.. ఆయన చూపు, తినే విధానం, మాట్లాడే మాట, నడిచే తీరు, హృదయంలో శాశ్వతంగా ఉండే ఆ ప్రశాంతతని.. తన కళ్లల్లో ఇట్టే కనిపించేలా చేశారు ధనుష్. సినిమా చూసిన తర్వాత ఈ పాత్రలో ధనుష్‌ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేరు. అంతలా తన నటనతో కట్టిపడేశారు.
మరోవైపు నాగార్జున ఈ సినిమాలో చేసిన పాత్ర నిజంగా ప్రశంసనీయం. ఎందుకంటే కథని మలుపు తిప్పే పాత్రలు చాలానే ఉంటాయి. కానీ కథలో ఉంటూ కథగా కథని చెప్పే పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి నిజాయతీపరుడి పాత్రలో నాగార్జున నటించారు. దేశానికి ఏదో చేసేయాలని సీబీఐ ఆఫీసర్ అయిన ఓ వ్యక్తిని.. అదే వ్యవ్యస్థలు, సంస్థలు అక్రమ కేసులు పెట్టి జైలులో తోసెస్తే పడే మానసిక క్షోభ.. దేశానికి ఇంత చేస్తే ఆ దేశం నాకు ఇదా ఇచ్చింది అని పడిన వేదనని.. నాగార్జున చాలా బాగా పలికించారు. నిజాయతీపరుడు అవినీతి చేయాలన్నా.. తప్పులు చేయాలన్నా కూడా చేయలేరు.. ఎందుకంటే నిజాయితీ వారి నరనరాల్లోనూ కలిసిపోయిన ఓ సత్యం. కానీ దేశమా.. ద్రోహమా అనే మధ్యలో నలిగిపోయే పాత్రలో నాగార్జున తన అనుభవాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా నటించారు. ఈ మధ్య కాలంలో నాగార్జునకి వచ్చిన మంచి పాత్ర ఇది.
ఇక రష్మిక ఇందులో హీరోయిన్ అని ఎక్కడా చెప్పలేం. ఎందుకంటే కథకి ఉపయోగపడే పాత్రనే శేఖర్ కమ్ముల ఆమెకి రాశారు. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నటించారు రష్మిక. చివరిగా విలన్‌గా చేసిన జిమ్ సర్బ్ అటు బిజినెస్‌మ్యాన్‌గా ఇటు క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ఒక అవతారంలో చాలా బాగా నటించారు. మిగిలిన వారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. దేవిశ్రీ ప్రసాద్.. మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా పోయిరా పోయిరా మావా, తల్లి మీద వచ్చిన సాంగ్ చూడటానికి కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇక సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన బీజీఎమ్ కూడా బాగా సూట్ అయింది. ఎక్కడా ఎక్కువ కాదు ఎక్కడా తక్కువ కాదు అన్నట్లుగా కొట్టారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది.
నటులు:అక్కినేని నాగార్జున,ధనుష్,రష్మిక మందన,జిమ్ సర్బ్,భాగ్యరాజ్
దర్శకుడు: శేఖర్ కమ్ముల
