
ప్రేమలో ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా కూడా.. మాటల్లో వివరించలేక మనోవేదన అనుభవించే ప్రేమ కథలెన్నో. ప్రాణంగా ప్రేమించిన ప్రతి ప్రేమికురాలు నిలదీసి అడగలేని ప్రశ్నలు కొన్ని మిగిలిపోతుంటాయి. అలా అడగలేని ప్రశ్నలు, చెప్పలేని ఫీలింగ్స్‌కి సమాధానం ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ. ఎమోషన్స్ ని బలంగా ఆవిష్కరించింది సినిమా. తాజాగా విడుదలైన ఈ సినిమా విశేషాలు…
కథ:
పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న భూమా దేవి (రష్మిక)ని గారాబంగా పెంచుతాడు తండ్రి రావు రమేష్. థియేటర్ ఆర్ట్స్, లిటరేచర్‌పై ఉన్న మక్కువతో రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎంఏ లిటరేచర్ జాయిన్ అవుతుంది భూమా దేవి. చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమా దేవి.. అనూహ్య పరిస్థితుల్లో అదే కాలేజ్‌లో చదివే విక్రమ్ (దీక్షిత్ శెట్టి) కంటపడుతుంది. తొలిచూపులోనే భూమాని ఇష్టపడతాడు విక్రమ్. భూమా ఇష్టపడాల్సి వస్తుంది. ఒక ముద్దు తో మొదలైన వారి ప్రేమ.. హద్దులు దాటేసరికి విక్రమ్‌లోని జెలసీ భూమాదేవి స్వేచ్ఛను హరించే స్థాయికి చేరుకుంటుంది. అతనిలోని అహంకారం, అనుమానం, హింసాత్మక ప్రవర్తన నుంచి బయటపడటానికి భూమా దేవి పడిన సంఘర్షణే మిగిలిన కథ.
ఎమోషనల్ లవ్ స్టోరీ:
అభిరుచి గల దర్శకుడనిపించుకున్న రాహుల్ రవీంద్రన్.. ప్రేమకథల్లో ఓ కొత్త కోణం చూపించారు ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంతో. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమ కథలో వుమెన్ సెంట్రిక్ అంశాన్ని జోడించి.. ప్రేక్షకులు ఈ కథకు రిలేట్ అయ్యేట్టు చేశారు. కథతో పాటు జర్నీ చేస్తూ.. ఆ కథలో తమని తాము చూసునేట్టు చేశారు. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి సందర్భం మన లైఫ్‌లో జరిగిన వాటిలా అనిపిస్తాయి.
ఇలాంటి ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పడం.. చెప్పి పాత్రల్ని ఒప్పించడం పెద్ద టాస్క్. ‘బదులు లేని ప్రశ్నలకు భయపడి నీ నుంచి నువ్వు పారిపోకు.. నువ్వు నచ్చినవాడి విన్నపాలనే కాదు.. నీ మనసు కోరుకునే విన్నపాలను విను’ అనే కోర్ ఎమోషన్ని ఆయా పాత్రలతో అద్భుతంగా పండించారు. తాను చెప్పే కథ.. ప్రతి ప్రేమికుడ్ని, ప్రేమికురాలిని వెంటాడేట్టు వెంబడించేట్టు చేశారు. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్శన్ కథతో రిలేట్ అవుతారు. మనకి తెలిసినప్పటికీ పైకి చెప్పలేని కొన్ని నిజాలను ఈ సినిమాలో చూపించారు దర్శకుడు.
ఓ అమ్మ.. ఓ కూతురు.. ఓ తండ్రి.. ఓ స్నేహితుడు.. ఈ చిత్రంలోని కథను ఈ క్యారెక్టర్లు నడిపిస్తాయి. పాత్రల చుట్టూ తిరిగే కథ కావడంతో ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. తెరపై కనిపించే సన్నివేశాలు రియాలిటీలో ఉన్నవే అయినా.. వాటిని మన రియల్ లైఫ్‌లో యాక్సెప్ట్ చేయలేం. అలాంటి సున్నిత అంశాలకు భావోద్వేగాలను జోడించి ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు రాహుల్ రవీంద్రన్. ఓ కొత్త తరహా ప్రేమకథను చూపించారు.
నటన:
ఈ సినిమాకి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ప్రధాన బలం. భూమా దేవి పాత్రలో రష్మిక కనిపించదు.. భూమా అనే పాత్రనే కనిపిస్తుంది. అంతలా లీనమైంది రష్మిక. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో నటిగా ఆమె మరో మెట్టు ఎక్కింది. పెద్ద సూట్ కేస్‌ని ఈడ్చుకుంటూ హాస్టల్లో అడుగుపెట్టింది మొదలు.. క్లైమాక్స్‌లో విజృంభించే సీన్ వరకూ ప్రతి ఫ్రేమ్‌లోనూ తానే కనిపిస్తూ.. కథకి కొండంత అండగా నిలిచింది రష్మిక. హాస్టల్లో ఉన్నప్పుడు ‘హాయ్ నాన్నా’ సినిమా డౌన్ లోడ్ పెట్టాను.. రా చూద్దాం అని హీరో అడిగినప్పుడు.. బయటకు వచ్చి.. మళ్లీ రెండు అడుగులు వెనక్కి వేసి.. మంచంపై ఉన్న చున్నీని కప్పుకుని వెళ్లే సీన్ ఆమె క్యారెక్టర్‌కి అద్దం పట్టేదిగా చూపించారు.
దీక్షిత్ శెట్టి.. ఈ సినిమాలో మల్టీ షేడ్స్ ఉన్న విలక్షణ పాత్రలో నటించాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన రావు రమేష్.. ‘ఆర్ఎక్స్ 100, కొత్త బంగారులోకం వంటి సినిమాల్లోను తన నటనను గుర్తు చేశారు. దుర్గగా అను ఇమ్మానుయేల్ మరో ఇంపార్టెంట్ రోల్ చేసింది. స్టైలిష్ అండ్ బోల్డ్ పాత్రలో మెప్పించడంతో పాటు.. కథానాయిక తన గమ్యం చేరడంలో సాయం అందించి కీలకంగా నిలిచింది. దర్శకుడిగానే కాకుండా.. ప్రొఫెసర్‌గానూ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు రాహుల్ రవీంద్రన్. రోహిణి ఒకే ఒక్క సీన్లో కనిపిస్తుంది.
పాటలు హైలైట్:
ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు. నాలుగు పాటలు, రెండు బిట్ సాంగ్స్ కథకి తగ్గట్టుగా భలే కుదిరాయి. కథని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఉంటాయి ఈ పాటలన్నీ. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌ని తన సహచరుడు ప్రశాంత్ విహారికి అప్పగించారు. ఇద్దరూ కలిసి ‘ది గర్ల్ ఫ్రెండ్’ మ్యూజికల్ హిట్ చేశారు. ఇలాంటి ఇంటెన్సిటీ లవ్ స్టోరీలకు సాంగ్స్, బీజీఎం ఆయువుపట్టు లాంటిది. కథలోని ఇంటెన్స్, ఎమోషన్ని క్యారీ చేస్తూ మంచి మ్యూజిక్ అందించారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. కథ చాలా వరకూ కాలేజ్‌లోనే ఉంటుంది. అయినా లొకేషన్స్ బోరింగ్ అనిపించకుండా ప్రతి షాట్‌లోనూ జాగ్రత్త పడ్డారు.
నటులు:రష్మిక,దీక్షిత్ శెట్టి,రావు రమేష్,రాహుల్ రవీంద్రన్
దర్శకుడు:రాహుల్ రవీంద్రన్
